బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి నివాసం నుంచి నలుగురు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. దిల్లీలోని హైసెక్యూరిటీ జోన్‌ నుంచి వాళ్లను ఎవరో కిడ్నాప్ చేశారని కేసు రిజిస్టర్ అయింది. 


నలుగురు కిడ్నాప్


దిల్లీలోని సౌత్‌ ఎవెన్యూలో బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి ఉంటున్నారు. ఆ ఇంటి నుంచే నలుగురు కనిపించకుండా పోయారు. నిన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారని పోలీసులకు జితేందర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు.  


జితేందర్‌ రెడ్డి డ్రైవర్‌ సహా నలుగురు


కిడ్నాప్‌ అయిన వారిలో జితేందర్‌ రెడ్డి దిల్లీ డ్రైవర్ థాపాతోపాటు మహబూబ్‌నగర్‌ నుంచి మున్నూరు రవి, మరో ఇద్దర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. 
నిన్న 2 వాహనాల్లో వచ్చి నలుగుర్ని బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. 


మంత్రిపై పోరాడుతున్న రవి


మున్నూరు రవి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై నడుస్తున్న కేసులో ప్రధాన ఫిర్యాదుదారు. శ్రీనివాస్ గౌడ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు పత్రాలు దాఖలు చేశారని రవి కేసు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. 


శ్రీనివాస్‌గౌడ్‌పై ఫ్యామిలీ అనుమానం!


గతంలో మహబూబ్‌నగర్‌ టిఆర్ఎస్ ఎంపీగా  జితేందర్ రెడ్డి ఉన్న టైంలో ఆయన అనుచరుడిగా మున్నూరు రవి ఉండేవారు. శ్రీనివాస్ గౌడ్ మనుషులే కిడ్నాప్ చేసి ఉంటారని మున్నూరు రవి కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. రవి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని వాళ్లు చెబుతున్నారు. 


ఏపీసీ 365 కింద కేసు నమోదు


తన నివాసం నుంచి నలుగురు కిడ్నాప్‌కు గురికావడంతో జితేందర్‌రెడ్డి పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఏపీసీ 365 కింద పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి ఎంక్వయిరీ చేస్తున్నారు.   


బీజేపీ నేతలు కూడా టీఆర్‌ఎస్‌ నేతలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పోరాడలేక ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు.