Hyderbad News: ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేసింగ్‌కు హైదరాబాద్‌ మరోమారు ఆతిథ్యమివ్వబోతోంది. దేశంలో తొలిసారి హైదరాబాద్‌ ఫార్ములా-ఈ రేసింగ్‌కు‌ ఆతిథ్యమిచ్చింది. వచ్చే ఏడాది కూడా ఫార్ములా-ఈ పోటీలు హైదరాబాద్‌ వేదికగా జరుగనున్నాయి. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ ఆతిథ్యంపై నిరాధార వార్తలు వస్తున్న నేపథ్యంలో పోటీల నిర్వహణపై నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో స్పష్టత ఇచ్చారు. 


వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్‌ వేదికగా పార్ములా-ఈ 10వ ఏబీబీ ఎఫ్‌ఐఏ సీజన్‌ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌లో మళ్లీ వచ్చే ఏడాది ఫార్ములా-ఈ కార్లు అభిమానులను అలరించబోతున్నాయి. గురువారం సమావేశమైన ఎఫ్‌ఐఏ వరల్డ్‌ మోటార్‌ స్పోర్ట్‌ కౌన్సిల్‌.. ఫార్ములా-ఈ 2024 వేదికలకు ఆమోదముద్ర వేసింది. దీంతో హైదరాబాద్‌లో మరో మారు రేసింగ్‌‌ను ఆస్వాదించే అవకాశం లభించింది. 


ఫిబ్రవరిలో తొలి రేస్


ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కారు రేస్‌ అట్టహాసంగా జరిగింది. ఈ పోటీల్లో 25 పాయింట్లతో జా ఎరిక్‌ వా మొదటి స్థానంలో నిలవగా, నిక్‌ క్యాసిడి 18 పాయింట్లతో రెండో స్థానంలో, 15 పాయింట్లతో ఆంటోనియో ద కోస్తా మూడో స్థానంలో రేస్ ముగించారు. భారత మోటార్‌ స్పోర్ట్స్‌లో నూతన అధ్యయనానికి హైదరాబాద్‌ వేదికైందని నిర్వాహకులు అన్నారు. ఫార్ములా వన్‌ తర్వాత ఎక్కువ ఆదరణ ఉన్న ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో నిర్వహించడంపై ప్రశంసలు అందుకుంటున్నారు. 


తరలివచ్చిన సెలబ్రిటీలు


హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్‌ రేస్‌ను వీక్షించేందుకు క్రికెటర్లు, సినిమా స్టార్స్, ప్రముఖులు భారీగా తరలివచ్చారు. క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, శిఖర్‌ ధావన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చాహల్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సంతోష్‌, ఎంపీ రామ్మెహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌, నటుడు రాంచరణ్‌, నటుడు జొన్నలగడ్డ సిద్ధార్థ, నాగార్జున, అఖిల్, నాగచైతన్య హాజరయ్యారు. వేగంగా దూసుకెళ్తున్న కార్లను చూసి వీక్షకులు కేరింతలు కొట్టారు. 


ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రభుత్వం


ఫార్ములా-ఈ రేసును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. దేశంలో తొలిసారి జరిగిన ఈ పోటీలకు ఆతిథ్య హక్కులు దక్కే విషయంలో మంత్రి కేటీఆర్‌ అన్నీతానై వ్యవహరించారు. ఎప్పటికప్పుడు ఫార్ములా-ఈ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. హైదరాబాద్‌ వేదికగా జరగడంలో కీలక భూమిక పోషించారు. ఈ క్రమంలో ఫార్ములా-ఈ నిర్వాహకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అప్పటి ఫలితంగానే హైదరాబాద్ మరోసారి ఫార్ములా-ఈ రేసింగ్‌కు వేదికైంది. 2024 ఫిబ్రవరిలో ఈ రేసింగ్ కార్లు హైదరాబాద్ రోడ్లపై దూసుకెళ్లనున్నాయి.


తొలి రేస్ విజేతలు వీరే


హుస్సేన్ సాగర్ వద్ద నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్‌లో ఫార్ములా ఈ రేస్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి. పలు దేశాల నుంచి వచ్చిన రేసర్స్ అత్యంత వేగంతో దూసుకెళ్లారు. జాగ్వార్, నిస్సాన్, కప్రా, అవలాంచ్, మహీంద్రా కార్లు ఈ రేస్ లో పాల్గొన్నాయి. మొత్తం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో 11 ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన ప్రధాన రేస్‌లో జా ఎరిక్‌ వా మొదటి స్థానంలో నిలిచి ట్రోఫీ అందుకున్నారు.