తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. సంగారెడ్డికి చెందిన రాజేందర్ వైద్య, ఆరోగ్య శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేందుకు ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. మామిళ్ల రాజేందర్ వీఆర్ఎస్ దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం, ఆమోదముద్ర వేసింది. 1987లో ఉద్యోగంలో చేరిన ఆయనకు మరో రెండేళ్ల సర్వీస్ ఉంది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టనున్నారు. మామిళ్ల రాజేందర్ త్వరలోనే భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ సామాజిక వర్గంలో ఒక్కరికి కూడా టికెట్ కేటాయించలేదు. రాష్ట్రంలో భారీ జనాభా ఉన్నప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదని ఆ సామాజిక వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ లో చేరితే అసెంబ్లీ టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఇదే సామాజిక వర్గానికి చెందిన రాజేందర్‌ను పిలుపించుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని చెప్పడంతో, మామిళ్ల రాజేందర్ స్వచ్ఛంద పదవీ విరమణకు వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్‌ఎస్ దరఖాస్తుకు ఆమోదం లభించింది.