KCR on Revanth Reddy: ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అసలు అవగాహనే లేదని అన్నారు. ప్రాజెక్టులు క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెలియదని అన్నారు. మన ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం వస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఆ అవగాహన లేకే అప్పగింతకు ఒప్పుకున్నారని అన్నారు. ‘‘నన్ను, నా పార్టీని టచ్‌ చేయడం నీ వల్ల కాదు. నీ కన్నా హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుందం’’టూ కేసీఆర్ రేవంత్ రెడ్డిపై మాట్లాడినట్లు తెలిసింది.


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక తొలిసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల అంశంపై పోరాటంపై నేతలకు కీలక సూచనలు చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ చిత్తశుద్ధిని తీసుకుపోయేలా ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు.


13న భారీ బహిరంగ సభ
తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకోవాలనే నినాదంతో ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎక్కడిదాకైనా పోరాడదామని చెప్పారు. తెలంగాణను సాధించి రాష్ట్ర హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలని కేసీఆర్ అన్నారు.


బీఆర్‌ఎస్‌కు పోరాటం కొత్త కాదని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అంతిమం అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ మూర్ఖపు వైఖరి వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ తీరును తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను, హక్కులను వంద శాతం కాపాడేందుకు ఎక్కడదాకైనా పోరాడాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ తీరు వల్ల హైదరాబాద్ రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు నీరు తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.