Fish Medicine | హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. జూన్ 8వ తేదీ రాత్రి చేప ప్రసాదం పంపినీ ప్రారంభించనున్నారు. 9వ తేదీన సైతం పంపిణీ కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Continues below advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులతో కలిసి చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వందల సంవత్సరాలుగా చేప ప్రసాదంపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, ఈ క్రమంలో మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

జూన్ 8న రాత్రి 9 గంటలకు ప్రారంభం

Continues below advertisement

సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తె ఉదయం పూట వస్తుందని, అయితే ఈసారి జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు మృగశిర కార్తె ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, రాత్రి సమయంలో పంపిణీకి అవసరమైన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా చేప ప్రసాదం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ కార్యక్రమం కోసం అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, విధుల్లో ఎవరూ అప్రమత్తత వీడకూడదని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

మృగశిర కార్తె సందర్భంగా వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వెలుపలి ప్రాంతాల నుండి వచ్చేవారికి వసతి, ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పంపిణీకి కావలసినన్ని చేప పిల్లలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని, ట్రాఫిక్, తాగునీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో దాదాపు రెండు శతాబ్దాల నుంచి ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని ఫ్యామిలీ చేపప్రసాదం పంపిణీ చేస్తోంది. లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉండటంతో లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. సాధారణ ప్రజలకు త్వరితగతిన ప్రసాదం అందేలా చూసేందుకు ఈసారి వీఐపీ పాస్‌ల జారీని పరిమితం (లిమిట్) చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం సరిపడా తాగునీరు, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటుతో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత భోజన సదుపాయాలు కల్పించేలా సర్వం సిద్ధం చేస్తున్నారు.