Revanth Reddy  South India : బెంగళూరులో ఓ మీడియా సంస్థ నిర్వహించిన  సదస్సులో "బై, ఫర్, అండ్ ఆఫ్ ది పీపుల్: గుడ్ గవర్నెన్స్ ఫర్ తెలంగాణ" అనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో కీలక అంశాలు వైరల్ అవుతున్నాయి.  దేశంలో కేటాయించే అత్యున్నత పదవుల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను ఆయన నిలదీస్తూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిని కేవలం పన్నులు వసూలు చేసే ప్రాంతంగానే చూస్తోందని, కీలక నిర్ణయాత్మక పదవులన్నీ ఉత్తరాది నేతలకే కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. 

Continues below advertisement

కీలక పదవులన్నీ ఉత్తరాదికే 

కేంద్ర ప్రభుత్వంలోని అగ్రశ్రేణి పదవులైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, రక్షణమంత్రి వంటి అత్యంత కీలకమైన పోర్ట్‌ఫోలియోలన్నీ ఉత్తరాది  నేతలకే దక్కాయని రేవంత్ రెడ్డి లెక్కలతో సహా ఎండగట్టారు. కేంద్రానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మేము పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీకి సెల్యూట్ చేస్తూ.. దేశంలో రెండో శ్రేణి పౌరులుగా బతకాలని అనుకోవడం లేదు  అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దక్షిణాది ఆత్మగౌరవ వాదాన్ని బలంగా వినిపించాయి.

Continues below advertisement

చైనాను రీప్లేస్ చేసేలా తెలంగాణ

పెట్టుబడుల ఆకర్షణ , గుజరాత్ మోడల్‌పై కూడా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  గుజరాత్ తనంతట తానుగా పెట్టుబడులను ఆకర్షించడం లేదు, మనల్ని బలవంతంగా అక్కడ పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారు అని విమర్శించారు. గత 20 ఏళ్లుగా కేవలం ఒకే ఒక్క రాయబారి గుజరాత్ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. తన పోటీ మహారాష్ట్ర , ఇతర భారతీయ రాష్ట్రాలతో కాదని.. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి అంతర్జాతీయ దేశాలతోనే తాను పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణను చైనా + 1 ప్రత్యామ్నాయంగా మార్చి, అంతర్జాతీయ స్థాయిలో చైనాను రీప్లేస్ చేయడమే తన నినాదమని స్పష్టం చేశారు.   

హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా

రాష్ట్రంలో  వివాదాస్పద  హైడ్రా  (HYDRAA) నిర్ణయంపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనికులు జలవనరులను, చెరువులను కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకనే 'హైడ్రా'ను ఏర్పాటు చేశానని, హిట్లర్‌కు ఇష్టమైన పదం నుండి స్ఫూర్తి పొంది ఈ పేరు పెట్టానని తెలిపారు. ఈ విభాగంలో 3,000 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించానని, ఇప్పుడు చెరువులను ఆక్రమించడానికి ఎవరూ సాహసించలేరని చెప్పారు. అలాగే యువతను పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశంలోనే అత్యుత్తమమైన 'ఈగిల్ ఫోర్స్'   ను రంగంలోకి దించామన్నారు.

 మహిళా సాధికారత, విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను రేవంత్ రెడ్డి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై  'జీరో టాక్స్' విధానం వల్ల తెలంగాణ ప్రభుత్వం రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ పర్యావరణం కోసం వెనకడుగు వేయలేదన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లో  67 లక్షల మంది సభ్యులు ఉన్నారని, వారికి వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సోలార్ ప్యానెల్ యూనిట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగించామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  వైట్ కాలర్ ఉద్యోగాలను రీప్లేస్ చేస్తున్న తరుణంలో, తాము ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీ  కి కార్పొరేట్ సీఈఓలనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా నియమించామని, వారే సిలబస్ నిర్ణయించి ఉద్యోగాలు కల్పిస్తారని రేవంత్ రెడ్డి ఈ సదస్సులో వెల్లడించారు.