NIMS Fire Accident: హైదరాబాద్‌ నిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ విభాగంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో ఆ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. ఆసుపత్రిలోని ఐదో అంతస్తులో ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన సంగతి తెలుసుకున్న రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది భయపడిపోయారు. పొగ కమ్మేయడంతో ఎవరు ఎటు వెళ్తున్నారో అర్థం కాలేదు. కాసేపు గందరగోళం నెలకొంది.  

నిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ స్పందించారు. దుర్ఘటన జరిగిన వెంటనే నిమ్స్ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు వివరించారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఏం కాలేదని అన్నారు. వేసవి కాలంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటివి జరిగినప్పుడు రోగులకు ఎలాంటి ఆపద కలగకుండా చూడాలని హితవుపలికారు.