మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య ఉన్న విభేదాలు మరింత పెరిగాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నేరుగా మంత్రి లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఆమె మీర్‌పేటను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాలను మంత్రి సబిత ప్రోత్సహిస్తున్నారని.. చెరువులు, స్కూలు స్థలాలను కూడా వదలడం లేదని ఆరోపించారు. చెరువుల్లో శిలాఫలకాలు పాతుతున్నారని ఆరోపించారు. మీర్‌పేటలో జరుగుతున్న అన్యాయాలపై తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. 


సబితా ఇంద్రారెడ్డి తమ పార్టీలో (టీఆర్ఎస్) ఎమ్మెల్యేగా గెలవలేదని విమర్శించారు. ఆమె కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చారని అన్నారు. స్థానిక మంత్రాలయ చెరువు దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని తీగల వ్యతిరేకిస్తున్నారు. చెరువుల పరిరక్షణ కోసం తాను ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరిక చేశారు. ట్రంక్ లైన్ నిర్మాణం ఇప్పటివరకూ చేయలేదని సబితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మంత్రి సబిత వ్యవహరిస్తున్న తీరుపై, ఆమె అవినీతికి సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్ కు అందిస్తానని చెప్పారు.


తాజా వ్యాఖ్యలతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11న తీగల కాంగ్రెస్ పార్టీలో చేరతారని అంటున్నారు. అయితే, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.


తీగల, సబిత మధ్య ఎప్పటినుంచో విభేదాలు
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మె్ల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. 2014లో టీడీపీ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా తీగల కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల గెలవలేదు. అక్కడే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 


2019లో కేబినెట్ ఏర్పాటుకు ముందు సబిత ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి అయ్యారు. సబిత గులాబీ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరికీ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒకరకంగా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న నేతలను పట్టించుకోకుండా, కాంగ్రెస్ నుంచి తనతో వచ్చిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని చాలా సార్లు సబిత తీరుపై తీగల విమర్శలు చేశారు.


నిన్న బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేయర్ పార్టీ మారేందుకు కారణం మంత్రి సబిత తీరు అనే ప్రచారం కూడా జరిగింది. ఈ వెంటనే తీగల కృష్ణారెడ్డి మంత్రిని టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది.