హీరో జూనియర్ ఎన్టీఆర్, కేంద్రమంత్రి అమిత్ షా భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా, మోదీ ఇద్దరు బీజేపీని దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాలని మాత్రమే ఆలోచిస్తారని తెలిపారు. వారికి అది తప్ప ఇంకో ధ్యాస ఉండందంటూ కామెంట్లు చేశారు. రాష్ట్రాల్లో బీజేపీని ఎలా అధికారంలోకి తేవాలన్నదే వారి లక్ష్యమని వివరించారు. నిత్యం అలాంటి పనిలోనే మునిగి ఉంటారని మాజీ మత్రి కొడాలి నాని తెలిపారు. మిగిలిన ఏ అంశాలను కూడా వారు పట్టించుకోరంటూ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ను కూడా రాజకీయ కోణంలోనే కలిశారని అనుకుంటున్నానని మనసులోని మాట బయటకు చెప్పారు. ఎన్టీఆర్ ఇప్పుడు కొత్తగా హీరో కాదని, పాతిక సినిమాలు కూడా చేశారని, తెలుగు సినిమాలు, హిందీలో కూడా డబ్ అవుతాయని గుర్తు చేశారు. ఎన్టీఆర్ సినిమాలను అమిత్ షా చూసే ఉంటారని కొడాలి అభిప్రాయపడ్డారు. ఏపీలో పవన్ కూడా దిల్లీ పెద్దలను కలవటం లేదని కొడాలి నాని అన్నారు. చంద్రబాబుకు అమిత్ షా ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అని అన్న కొడాలి నాని.. ఆయనతో బీజేపీ దేశ వ్యాప్తంగా ప్రచారం చేయించుకుంటుందేమో అన్నారు. రాజకీయ ప్రయోజనం లేకుండా ఒక్క నిమిషం కూడా అమిత్ షా ఎవరితో మాట్లాడరని కొడాలి నాని గుర్తు చేశారు.
అమిత్ షా, ఎన్టీఆర్ దేని గురించి మాట్లాడుకున్నారు..?
అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీలో ఏమేం చర్చించారు ? ఇప్పుడిదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. రామ్‌చరణ్ లేదా మరో సినిమా స్టార్‌ను అమిత షా పిలిచి ఉంటే ఇంత చర్చనీయాంశమయ్యే చాన్స్ లేదు. కానీ ఆయన పిలిచింది జూనియర్ ఎన్టీఆర్‌ను. ఆయన వెనుక బోలెడంత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆయన కచ్చితంగా ఇన్‌ఫ్లూయన్సర్ అని ఎక్కువ మంది నమ్ముతారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా ఆహ్వానించడంపై ఎక్కడా.. ఎప్పుడూ లేనంత చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ ను అభినందించేందుకు మాత్రం కాదు..!
బీజేపీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అమిత్ షా ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా చూశారు. అందులో కొమురం భీం పాత్రను ఆయన అమితంగా ఇష్ట పడ్డారు. అందుకే హైదరాబాద్ వస్తున్న సందర్భంగా తనతో భోజనానికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. అయితే నిజంగా కొమురం భీం పాత్ర ఆకట్టుకుని ఉంటే అమిత్ షా.. ముందుగా సినిమా యూనిట్‌ను అభినందించారు. ఆ పాత్ర సృష్టించిన రాజమౌళిని మర్చిపోకూడదు. కానీ ఇక్కడ ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రమే ఆహ్వానించారు. అందుకే కచ్చితంగా అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ వెనుక ఏదో ఉందని నమ్ముతున్నారు. కేవలం ప్రశంసల కోసమేనని అనుకోవడం లేదు.
15 నిమిషాలన్నారు.. 45 నిమిషాలు చర్చించారు..!
ఎన్టీఆర్, అమిత్ షాల డిన్నర్ భేటీ దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు సాగింది. ఇందులో ఇరవై ఐదు నిమిషాల పాటు అందరూ కలిసి డిన్నర్ చేశారు. ఈ డిన్నర్ భేటీలో కిషన్ రెడ్డి ఇతర ప్రముఖులు ఉన్నారు. కానీ తర్వాత అమిత్ షా.. ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా ఇరవై నిమిషాలు మాట్లాడారు. ఏం మాట్లాడారన్నది వారు చెబితే తప్ప బయటకు తెలియదు. ఇందులో రాజకీయాలు ఉన్నాయని ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే ఎన్టీఆర్‌కు రాజకీయ నేపథ్యం ఉంది. అంతకు మించి ఛరిష్మా ఉంది. ఆర్ఆర్ఆర్‌లో తెలంగాణ పోరాట యోధుడు కొమురంభీం పాత్ర పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. కానీ అసలు అమిత్ షా.. బీజేపీ లక్ష్యం ఏమిటో మాత్రం స్పష్టత లేదు.