కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదు- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తేల్చేసింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ వేసినందుకు ఈ తీర్పు ఇచ్చింది.
కాంగ్రెస్ తరపున 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. అప్పటి టీఆర్‌ఎస్ తరఫున జలగం వెంకట్రావు పోటీ చేశారు. అయితే ఈ పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. దీంతో ఆయన ఎన్నికల్లో తప్పుడు అఫివిడవిట్ వేశారని ప్రత్యర్థి జలగం వెంకట్రావు కోర్టులో కేసు వేశారు. దీనిపై ఇన్ని సంవత్సరాలు విచారణ చేసిన కోర్టు ఇవాళ(జులై 25, మంగళవారం) తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో వాదోపవాదనలు విన్న రాష్ట్ర ధర్మాసనం వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. సమీప ప్రత్యర్థి అయిన జలగం వెంకట్రావు విజయం సాధించినట్టు స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించిందికోర్టు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, కేసుల విషయంలో వనమా తప్పుడు వివరాలు ఇచ్చారని పేర్కొంది.