Jubilee Hills ByElections:   జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల ప్రక్రియలు పూర్తయిన తర్వాత, చివరికి 58 మంది అభ్యర్థులు పోటీకి మిగిలారు. దాఖలైన నామినేషన్లతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినా ఈ నియోజకవర్గంలో ఇంత భారీగా పోటీలో ఉండటం ఇదే మొదటి సారి. అక్టోబర్ 14 నుంచి 16 వరకు జరిగిన నామినేషన్ల సమయంలో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేసారు.  పరిశీలనలో చాలా నామినేషన్లు చెల్లకుండా పోయాయి. చెల్లిన వారిలో 23మంది ఉపసంహరించుకున్నారు.  ఫలితంగా 58 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఈ సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ.           

211 నామినేషన్లలో చివరికి బరిలో నిలిచింది 58 మమంది మాత్రమే                 

మొత్తం 211 మంది అభ్యర్థులు మొత్తంగా 321 నామినేషన్లను దాఖలు చేశారు.  నామినేషన్ల పరిశీలన గురువారం తెల్లవారుజామున 3 గంటల దాకా కొనసాగింది. మొత్తం 321 నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి.. 186 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 135 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు తేల్చారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 130 మందికి చెందిన నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించగా, 81 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపారు. వారిలో 23 మంది ఉపసంహరించుకున్నారు.               

కాంగ్రెస్ ఓడించేందుకు అంటూ నిరుద్యోగులు, ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు పోటీ                   

2009 ఎన్నిక‌ల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018లో 18 మంది పోటీ ప‌డ్డారు. 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 19 మంది పోటీ ప‌డ్డారు. ఈ 19 మందిలో బీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ గెలుపొంది వ‌రుస‌గా  మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమయింది.  ఫార్మాసిటీ, ట్రిపుల్‌ఆర్‌ బాధితులు, నిరుద్యోగులతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిరసన రూపంలో నామినేషన్లు దాఖలు చేసి పోటీలో ఉన్నారు. వారు తాము కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నామని ప్రకటించారు                    

మూడు ప్రధాన పార్టీల రసరత్తువ పోరు - జోరు ప్రచారం                       

బీఆర్ఎస్  పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పలువురు కీలక నేతలకు అప్పగించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది టీబీజేపీ. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డితో పాటు బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ ప్రచారానికి ఉత్తరప్రదేశ్ , గోవా రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలను నిర్వహించే అవకాశం ఉంది.