Palem and kurnool bus accidents: శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు నగరానికి సమీపంలోని చిన్న టేకూరు వద్ద జరిగిన వోల్వో బస్సు అగ్ని ప్రమాద దుర్ఘటనలో 20 నిండుప్రాణాలు పోయాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న వోల్వో బస్సు.. వేగంగా వెళుతూ ఓ మోటర్‌బైకును ఢీ కొట్టి..  ఆ క్రమంలో బస్సులో మంటలు రేగి.. అది పూర్తిగా తగులబడిపోయింది. 40మందికిపైగా ఉన్న బస్సులో సగం మందే ప్రాణాలు కాపాడుకోగలిగారు. స్లీపర్‌ బస్సు సీట్లలోనే 20మంది సజీవంగా దహనం అయిపోయారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చకు అటెన్షన్‌కు దారి తీసింది. కానీ దీనికి మించిన దుర్ఘటన ఇప్పుడు ప్రమాదం జరిగిన హైవేపైనే.. ఓ గంట దూరంలో మరో భారీ ప్రమాదం 12 ఏళ్ల కిందట జరిగింది.

Continues below advertisement


పాలెం బస్సు ప్రమాదం – Palem Bus Accident


పాలెం బస్సు దుర్ఘటనను జనాలు అంత తేలికగా మర్చిపోలేరు. క్షణాల్లో బస్సు మొత్తం బూడిదైపోయి.. శరీరాలు గుర్తు పట్టడానికి కూడా వీలుకాని విధంగా 45 ప్రాణలు  బూడిద కుప్పలుగా మారిపోయాయి. అక్టోబర్ 30, 2013న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి మహబూబ్ నగర్‌ జిల్లా, ఇప్పటి వనపర్తి జిల్లాలోని పాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4-5 గంటల మధ్యలో జరిగిన ఈ ప్రమాదంలో క్షణాల్లోనే బస్సు మసైపోయింది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అతిపెద్ద రోడ్డు ప్రమాదాల్లో అది ఒకటిగా నిలిచిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. మరో గంటలో హైదరాబాద్‌ చేరుకుంటారనగా తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలచివేసింది.


ఒకే హైవేపై ఒకే రీతిలో ప్రమాదాలు – అతివేగమే అనర్థం


బెంగళూరు హైవేపై జరిగిన ఈ రెండు దుర్ఘటనలు… అత్యంత ఘైరమైన రోడ్డు ప్రమాదాలుగా నిలిచిపోతాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్  బస్సు కర్నూలు దాటిని తర్వాత ప్రమాదానికి గురైతే.. అప్పుడు బెంగళూరు నుంచి వస్తున్న  జబ్బార్ ట్రావెల్స్ బస్సు కొత్తకోట సమీపంలోని పాలెం గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. ఈ రెండు ఘటనల్లోనూ అతి వేగమే ప్రమాదానికి కారణంగా అర్థమవుతోంది. టేకూరు వద్ద వేగంగా వెళుతున్న Volvo బస్సు.. మోటర్‌ సైకిల్‌ను ఢీ కొడితే అది బస్సు కిందకు వెళ్లిపోయి మంటలు చెలరేగాయి. అప్పుడు జబ్బార్ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళుతున్న మరో కారును ఓవర్‌టేక్ చేస్తూ పక్కకు వెళడంతో బస్సుకు ఉన్న డీజిల్ ట్యాంక్ రోడ్ డివైడర్‌కు గుద్దుకుని మంటలు రేగాయి. క్షణాల్లోనే బస్సును దగ్ధం చేశాయి.  


90 కిలోమీటర్ల పరిధిలో రెండూ బెంగళూరు హైవేపేనే జరిగాయి.



  • వేగం & డ్రైవింగ్‌కి నియంత్రణ లేకపోవడం, అప్రమత్తరాహిత్యమే మూల కారణాలు.

  • ప్రమాదాలు జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడం—ప్రాణాపాయం పెరగడం.

  • రాత్రి టైమ్, ప్రయాణికులు నిద్రలో ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువవడం.


ఈ రెండు ప్రమాదాలు బస్సుల డిజైన్, వేగ నియంత్రణ, ఫిట్‌నెస్, ఎస్కేప్ ప్లాన్ వంటి విషయాలపై చర్చకు దారితీస్తున్నాయి. బస్సుల్లో అగ్ని కీలలు రాగానే క్షణాల్లోనే కాలిపోతున్నాయని బస్సుల తయారీకి వాడుతున్న మెటీరియల్ మంటలను వేగంగా వ్యాప్తి చేస్తోందని దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కూడా వ్యాఖ్యలు చేశారు.




ఇంతే కాదు.. రెండేళ్ల కిందట ఇదే హైవే పై ఈ ప్రమదాలకు సమీపంలోనే జడ్చర్ల వద్ద కూడా తెలంగాణ ఆర్టీసి బస్సు కాలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం జరగలేదు. అది ఏసీ బస్సు కాకపోవడం వల్ల ప్రయాణీకులు వేగంగా కిటికీల్లోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.