Vijaya Rama Raju's Arjun Chakravarthy OTT Streaming: నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన రీసెంట్ స్పోర్ట్స్ డ్రామా 'అర్జున్ చక్రవర్తి'. విజయ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 2 నెలల తర్వాత ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో శుక్రవారం నుంచి 'అర్జున్ చక్రవర్తి' మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించగా... శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే 46 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది ఈ చిత్రం. మూవీలో విజయ రామరాజుతో పాటు సిజా రోజ్, దయానంద్ రెడ్డి, హర్ష్ రోషన్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: 'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్లకు దూరంగా 'దేవసేన'! - జస్ట్ వెయిట్ ఫర్ బిగ్ సర్‌ప్రైజ్
స్టోరీ ఏంటంటే?
1980 - 96ల మధ్య జరిగిన రియల్ లైఫ్ స్టోరీ ఇది. అనాథ అయిన అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు)ని మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య (దయానంద్ రెడ్డి) చేరదీస్తాడు. రంగయ్యలాగే తాను కూడా కబడ్డీలో జాతీయ స్థాయి ప్లేయర్ కావాలని అనుకుంటాడు చక్రవర్తి. అర్జున్ ఇష్టాన్ని గుర్తించిన రంగయ్య అతన్ని తన మేనల్లుడు అని చెప్పుకుంటూ కబడ్డీ ట్రైనింగ్ ఇస్తాడు. ఇదే టైంలో జిల్లా స్థాయిలో ఆడుతున్న సందర్భంలో దేవిక (సిజా రోజ్)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.
ఆ తర్వాత ఓ కీలక మ్యాచ్ కోసం దేవికను దూరం పెడతాడు. దేశం తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆడి పతకం సాధిస్తాడు. అయితే, తిరిగి వచ్చిన తర్వాత ఓ కారణంతో మద్యానికి బానిసవుతాడు. తనకు ఇష్టమైన కబడ్డీని దూరం పెడతాడు. అసలు అర్జున్ ఎందుకు మద్యానికి బానిసయ్యాడు? తాను ప్రాణంగా ప్రేమించే కబడ్డీని ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? దేవికతో ప్రేమ వ్యవహారం ఏమైంది? తనలాగే కబడ్డీ ప్లేయర్స్ కావాలనుకున్న గ్రామీణ ప్రాంత యువకుల కోసం అతను ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.