Chikoti Praveen: క్యాసినో కేసులో చికోటి ప్రవీణ్‌కు నాలుగో రోజూ ఈడీ విచారణ ముగిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం  చెప్పానని చికోటి ప్రవీణ్ వివరించారు. విచారణ పూర్తి అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. పని గట్టుకొని కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చికోటి వెల్లడించారు. సోషల్ మీడియాలో తన పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఇదే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని చికోటి ప్రవీణ్ తెలిపారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడితే.. తప్పులు పోస్టులు పెడుతూ.. తన పేరంతా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తన పేరు పాడైనప్పటికీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానన్నారు చికోటి ప్రవీణ్. క్యాసినో నిర్వహించానని అంగీకరించిన ప్రవీణ్ అందులో తప్పేముందంటూ ప్రశ్నించారు. గోవా, నేపాల్‌లో చట్టబద్ధంగా నడుస్తున్న చోటికి ఇక్కడి నుంచి పలువురిని తీసుకెళ్లినట్లు వివరించారు. తనకు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని అన్నారు.  


అసలు ఈడీ విచారణ దేనిపై..?


తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారాలు అనేక మంది క్యాసినోలకు వెళ్లినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. దీనిపై కూడా ప్రవీణ్ బృందాన్ని లోతుగా ప్రశ్నించింది. హవాలా ద్వారా నగదు బదిలీ వ్యవహారంలో ఈడీ అధికారుల ప్రశ్నలకు ప్రవీణ్, మాధవ రెడ్డి తడబడినట్లు తెలుస్తోంది. క్యాసినోలో జూదం ఆడాలంటే విదేశీ మారక ద్రవ్యం కావాలి. పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తీసుకు వెళ్లడం సాధ్య పడదు. ఈ క్రమంలోనే తమకు కావాల్సిన విలువకు తగ్గట్టు నగదు చెల్లిస్తే ప్రవీణ్, అతని అనుచరులు ఇక్కడే టోకెన్లు ఇచ్చే వారని, వాటితోనే విదేశాల్లో జూదం ఆడేవారని తెలుస్తోంది. ఫెమా నిబంధనల ప్రకారం ఇది చట్ట విరుద్ధం. దీనిపైనే ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది.


ప్రవీణ్ వెనుక ఎవరున్నారు...?


ప్రవీణ్ బృందం గత కొన్ని సంవత్సరాలుగా విదేశాల్లో క్యాసినోలకు తీసుకువెళ్లిన ప్రముఖుల సమాచారం తెలుసుకుంటుంది. విచారణలో ఇలాంటి చాలా విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. హవాలా మార్గంలో ద్రవ్య మారకం జరిగనట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దాని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలులోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి వీరి ప్రమేయం ఉన్నట్లు బయట పడితే... రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మరికొంత మందికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.