అల్లూరి సీతారామరాజు ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో ఆంగ్లేయులపై పోరాటం చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయన పోరాటం, దేశ భక్తి అసమానమైనవని నేతాజీ తరహాలోనే ఆయన పోరాటం కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపిందని అన్నారు. మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలని అన్నారు. స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనాన్ని హైదరాబాద్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రారంభించారు.
రాష్ట్రపతి సమక్షంలో జరగడం సముచితం - కేసీఆర్
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు లాంటి మహానీయుడి 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం యావత్ జాతి కర్తవ్యం అని కేసీఆర్ అన్నారు. ఈ ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు పోరాట చైతన్యాన్ని, దేశభక్తిని కొత్త తరానికి ఘనంగా చాటిచెబుతాయని నేను విశ్వసిస్తున్నానని అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం చాలా సముచితమని అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి తనను ఆహ్వానించడం చక్కగా భావిస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పారు.
నేడు ఉదయం హకీంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మేడ్చల్ కలెక్టర్ తదిరులు ఉన్నారు.