మరో నాలుగు రోజులు... అంతే... 13వేల మందికిపైగా నిరుపేదలు ఇంటి యజమానులు కాబోతున్నారు. సొంత ఇల్లు అనేది కలగానే మిగిలిపోతుందనుకున్న ఆ పేదవారికి...  తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు చేతులో పెట్టబోతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే మొదటి విడత ఇళ్ల పంపిణీ జరిగిపోగా... ఇప్పుడు రెండో విడత పంపిణీ  చేయబోతున్నారు.


హైదరాబాద్‌లో రెండో విడత డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి డేట్‌ కూడా ఫిక్స్‌ అయ్యింది. ఈనెల 21నే 13 వేల 200 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనుంచి  కేసీఆర్‌ సర్కార్‌. నగరంలోని 9 ప్రాంతాల్లో ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ జరుగనుంది. ఇందు కోసం పూర్తి పారదర్శకతతో 13వేల 200 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు.  వీరికి వీరికి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, సబితారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పట్నం మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌,  మేయర్‌ విజయలక్ష్మిలు.. ఆయా ప్రాంతాల్లో ఇళ్లను పంపిణీ చేస్తారు.


రెండో విడత డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఈనెల 15న లక్కీ డ్రా నిర్వహించారు. దీని ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో మొత్తం 13వేల 200 మంది  లబ్దిదారులను ఎంపిక చేశారు. ఆసారి లబ్ధిదారుల ఎంపికలో రిజర్వేషన్ల విధానాన్ని పాటించామన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌. జీహెచ్ఎంసీ పరిధిలోని 24  నియోజకవర్గాల్లో... ప్రతి నిజయోకవర్గం నుంచి కనీసం 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు అధికారులు కూడా వివరించారు. 


పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.10 వేల కోట్ల వ్యయంతో  అన్ని సౌకర్యాలతో కూడిన లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే మొదటి విడత ఇళ్ల పంపిణీ జరిగిపోయింది. ఈనెల 2న 8 ప్రాంతాలలో మంత్రులు, ఇతర  ప్రజాప్రతినిధుల చేతులమీదుగా... 11వేల 700 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను పంపిణీ చేశారు. ఇప్పుడు రెండో విడత కోసం... ఈనెల 15న మంత్రులు,  ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్‌లైన్‌లో డ్రా నిర్వహించి 13వేల 200 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. డ్రా లో ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 21న 9  ప్రాంతాలలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు.


కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్‌ ప్రాంతంలో మంత్రి కేటీఆర్‌.. 2వేల 100 ఇళ్లను లబ్దిదారులకు అందించనున్నారు. ఇక, మహేశ్వరం నియోజకవర్గం మన్‌సాన్‌పల్లి   ప్రాంతంలో 700 ఇళ్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అట్టిగూడలో 432 ఇళ్లను పట్నం మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తట్టి  అన్నారంలో 12 వందల 68 ఇళ్లను మహబూద్‌ అలీ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తిమ్మాయిగూడలో 600 ఇళ్లను మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ, పటాన్‌చెరు  నియోజకవర్గంలోని కొల్లూరు-2లోని 4వేల 800 ఇళ్లను మంత్రి హరీష్‌రావు, మేడ్చల్‌ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో 12వందల ఇళ్లను మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్‌  నియోజకవర్గంలోని చర్లపల్లిలో వెయ్యి ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, మేడ్చల్‌ నియోజకవర్గంలోని ప్రతాప్‌ సింగారంలో 11 వందల ఇళ్లను డిప్యూటీ స్పీకర్‌  పద్మారావు గౌడ్‌ పంపిణీ చేయనున్నారు.


మధ్యవర్తులతో సంబంధం లేకుండా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉండేందుకు ఎన్ఐసీ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ర్యాండమైజేషన్ పద్ధతిలో పారదర్శకంగా  లబ్ధిదారుల ఎంపిక జరిగిందని అధికారులు తెలిపారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లక్కీ డ్రా తీసినట్లు చెప్పారు. రెండో విడత లబ్దిదారలు్లో దివ్యాంగులు 470  మంది, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు 1,923 మంది, ఎస్టీలు 655 మంది, ఇతరులు 8,652 మంది ఉన్నారు. వీరందరికీ ఈనెల 21న ఇళ్లు పంపిణీ చేసి సొంతింటి కల  సాకారం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. 


పేదల సొంతింటి కల సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రులు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని చెప్పారు.  లక్కీ డ్రాలో పేరు రాని వారు నిరుత్సాహ పడాల్సిన అవసరంలేదని... అర్హులందరికీ ఇళ్లను ఇస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి  వస్తుందని... అప్పుడు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందజేస్తామని చెప్పారు.