Telangana News: తెలంగాణలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ‌్యం అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందజేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో 1500 కోట్ల భారం పడనుంది.
పేదలకు సన్నబియ్యం
తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందనున్నాయి. పేదలకు రూపాయికే కిలో బియ్యం అందజేస్తున్నా...ప్రజలెవ్వవరూ వాటిని తినడం లేదు. కొందరు కనీసం బియ్యం తీసుకోకుండా రేషన్ దుకాణాల్లోనే ఆ మేరకు డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం ఏమాత్రం తినడానికి పనికిరావని ప్రజలు చెబుతున్నారు. దీంతో ఆ బియ్యం వివిధ మార్గాల ద్వారా కాకినాడ, చెన్నై పోర్టులకు చేరి అక్కడి నుంచి విదేశాలకు తరలిపోతోంది. దీంతో పేదలకు సన్నబియ్యమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ముందుగానే కసరత్తు ప్రారంభించిన సర్కార్....ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు పెద్దఎత్తున సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించింది. క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు సైతం ఈసారి సన్న వడ్లు పండించారు.
అదనపు వ్యయం
రాష్ట్రంలో మొత్తం 89.60 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ బియ్యం పంపిణీ చేయాలంటే నెలకు 2 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతుంది. ఏటా 24 లక్షల టన్నుల సన్న బియ్యం కావాలని అధికారులు అంచనాలు రూపొందించారు. మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యంపై రాష్ట్రప్రభుత్వం 3వేల600 కోట్ల సబ్సిడీ భరిస్తుండగా... సన్నబియ్యంతో పంపిణీతో మరో 1,500 కోట్లు భారం పెరిగే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 20 లక్షల మంది ఎదురుచూస్తున్నారు.
ఉగాది నుంచి ప్రారంభం
తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే పేదలందరికీ రేషన్‌కార్డులపై ఉచితంగానే సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం 20 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..వారిలో కనీసం 10 లక్షల మందికి కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలు ఉపయోగంతోపాటు వరి ధాన్యం పండించే రైతులనూ ఆదుకోవచ్చని సర్కార్ భావిస్తోంది. అలాగే రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌కు కళ్లెం వేయవచ్చని అంచనా వేస్తోంది. సన్నబియ్యం సేకరణకు కిలోకు 55 రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 36 రూపాయలు కేంద్రం భరిస్తుండగా...మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే సర్దుబాటు చేయాల్సి ఉంది. సంక్రాంతి కానుకగానే పేదలకు సన్నబియ్యం పంపిణీకి సర్కార్ ఏర్పాట్లు చేయగా....రైతుల నుంచి సేకరించిన సన్న వడ్లు కనీసం రెండు నెలలైనా నిల్వ చేస్తేనే బాగుంటాయని...ఇప్పటికిప్పుడు కొత్త బియ్యం అందజేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అధికారులు సీఎంకు సూచించారు. దీంతో ఉగాది నాటికి బియ్యం సిద్ధం చేసి పంపిణీ చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి`