Medchal News: మేడ్చల్‌లోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు మరోసారి భగ్గమన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు గర్ల్స్‌ హాస్టల్‌లోకి వచ్చి బాత్‌రూమ్‌లో ఫొటోలు తీశారని ఆరోపిస్తూ బుధవారం అర్థరాత్రి ఆందోళనలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పడంతో శాంతించారు. అయితే వారి వద్ద న్యూడ్ వీడియోలు ఉన్నాయని ప్రచారం జరగడంతో మరోసారి విద్యార్థులు నిరసన బాటపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఆరోపిస్తూ కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. 


విద్యార్థులకు విద్యార్థి సంఘాల మద్దతు


సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు చేస్తున్న ధర్నాకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఉదయం నుంచి కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బయటవారు లోపలికి రాకుండా కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. దీంతో కాలేజీ లోపల విద్యార్థులు ధర్నా చేస్తుంటే గేటు బయట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. 


గేటు ఎక్కి వచ్చిన విద్యార్థి సంఘాలు 


ఈ పరిస్థితుల్లో అక్కడకు విద్యార్థి సంఘాల నాయకులు రావడంతో పరిస్థితి మరింతగా మంటపుట్టించింది. వారంతా సెక్యూరిటీని తోసుకొని గేట్లు ఎక్కి కాలేజీ లోపలికి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. 


కాలేజీ గుర్తింపు రద్దుకు డిమాండ్ 


గర్ల్స్‌ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారని విద్యార్థినులు వారికి వివరించారు. వంట చేసే వారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం దిగి వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. మరోవైపు విద్యార్థి  సంఘ నాయకులు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకొని మేడ్చల్‌లోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి తప్పు చేయకుంటే యాజమాన్యం ఇంత వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. 


తల్లిదండ్రుల్లో కంగారు


రాత్రి నుంచి జరుగుతున్న గడబిడ చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుంటున్నారు. తమ బిడ్డలకు ఏమైందో అని కంగారు పడుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం జోక్యం చేసుకొని వివాదాన్ని పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా సరే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో బిడ్డలను దూరంగా ఉంచి చదివిస్తుంటే ఇలాంటి ఘటనలు తమను నిద్రపోనివ్వడం లేదని వాపోతున్నారు. భవిష్యత్‌లో ఈ పరిస్థితి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. 


అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు 


ఘటనా స్థలానికి మేడ్చల్‌ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ చేరుకుని విద్యార్థులతో మాట్లాడుతున్నారు. అనుమానితులుగా చెబుతున్న ఏడుగురిని అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద ఉన్న 11 సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ప్రైవేటు వీడియోలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న వేళ వాటిపై కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు విద్యార్థులకు వివరించారు. అయినా వారు శాంతించడం లేదు. దుండగులకు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Also Read: అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం - జేసీ దివాకర్‌రెడ్డికి భారీ నష్టం