Ponguleti Srinivasa Reddy About Indiramma Housing Scheme | హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ తరువాత లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  గురువారం తన ఛాంబర్‌లో అంతర్గత సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ సర్వే 74 శాతం పూర్తయిందని, ప్రజాపాలన కార్యక్రమంలో 80,54,554 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వాటిలో ఇప్పటివరకు 59,89,889 దరఖాస్తులపై సర్వే పూర్తయింది. 


ఇందిరమ్మ ఇళ్లపై నల్గొండ జిల్లాలో అత్యధికంగా 94 శాతం సర్వే పూర్తయింది. అతి తక్కువగా జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో 16 శాతం దరఖాస్తుల పరిశీలన, సర్వే జరిగినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణ వ్యాప్తంగా ఇతర 32 జిల్లాల్లో కేవలం వారం రోజుల్లో 100 శాతం సర్వే ప్రక్రియ పూర్తి కానుంది. సంక్రాంతి (Pongal 2025) తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గ్రామసభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితా తయారీ చేయనుంది. ఈ మేరకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 
పేదలకు ఇళ్ల కోసం ఇందిరమ్మ కమిటీలు
తెలంగాణ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పింది. తరువాత ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అందులో భాగంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేసి వారికి ఇందిరమ్మ ఇండ్లు అందించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసింది. లబ్ధిదారుల ఎంపికలో కమిటీలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. కమిటీలు రూపొందించిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేసి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్లు పరిశీలించిన అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు లబ్ధిదారుల జాబితా పంపిస్తారు. జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదం తెలిపితే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో దశల వారీగా జమచేస్తారు. 


ప్రజాపాలన దరఖాస్తులు ప్రాతిపదికన లబ్ధిదారుల జాబితా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తక్కువ సమయంలోనే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించిన దరఖాస్తులతో తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికే పథకాలు అని ప్రచారం చేయడంతో కొందరు దరఖాస్తు చేసుకోలేదు. ప్రభుత్వానికి ఎలాంటి వివరాలు అందించలేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం సైతం అందులో దరఖాస్తులు చేయలేదు.  ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసిన ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్‌ ద్వారా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. కానీ ప్రజాపాలన కార్యక్రమం అనంతరం చాలామంది ఇందిరమ్మ ఇళ్ల కోసం  దరఖాస్తులు చేశారు. తమ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల జాబితా రూపొందించాలని ప్రభుత్వానికి కొంతకాలం నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. 



జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం..
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) కృషి చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ 2025) మీడియా డైరీని మంత్రి ఆవిష్కరించారు. జర్నలిస్టులకు ఇండ్లు, అక్రిడియేషన్ కార్డులు, హెల్త్ కార్డుల సమస్యలను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లగా త్వరలో వాటిని పరిష్కరిస్తామన్నారు. 


Also Read: Nagoba Jatara 2025: జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు