బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదాలతో పాటు ఫ్లెక్సీలు, డిజిటల్ బోర్డుల రూపంలో విమర్శల హడావుడి కొనసాగుతూనే ఉంది. కొద్ది వారాల క్రితం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు సాలు దొర.. సెలవు దొర, సాలు దొర.. సంపకు దొర అంటూ డిజిటల్ బోర్డులు ఏర్పాటైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బీజేపీ ఆఫీసు ముందు సెలవు దొర డిజిటల్ బోర్డు మళ్లీ కనిపించింది. ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సూచిస్తూ దీన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ గతంలో కౌంట్ డౌన్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్​ బోర్డుపై టీఆర్ఎస్ నేతల నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వచ్చి తీవ్ర దుమారంగా మారింది. 


ఆఖరికి జీహెచ్ఎంసీ కూడా ఈ డిజిటల్ బోర్డుపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులు తొలగించాలని చెప్పడంతో బీజేపీ నేతలు ఈ బోర్డును తీసేశారు. తాజాగా మళ్లీ ఆ డిజిటల్ బోర్డును పెట్టారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీజేపీ రాష్ట్ర నేతలు, మళ్లీ పార్టీ కార్యాలయం అవరణలో 'సాలు దొర సెలవు దొర' డిజిటల్ బోర్డును పెట్టారు. సీఎం కేసీఆర్ గద్దె దిగే వరకు ఈ కౌంట్ డౌన్ బోర్డు కొనసాగుతుందని పార్టీ నేతలు గతంలోనే చెప్పారు.


ఫ్లెక్సీల వార్ కూడా
ఇప్పుడు ఫ్లెక్సీల వార్ కూడా ఇలాగే నడుస్తోంది. తాజాగా ఇది రాజేంద్రనగర్ లో కనిపించింది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో వినూత్నంగా హోర్డింగ్స్‌ వెలిశాయి. అభివృద్ధిలో ఎవరి వాటా ఎంత? కేంద్రం ఇచ్చిన నిధులెన్ని? రాష్ట్రం ఇచ్చిన సొమ్మెంత? ప్రజలారా ఆలోచించండి అంటూ స్థానిక బీజేపీ నాయకులు హోర్డింగులు పెట్టారు. సొమ్మొకరిది - సోకొకరిది అనే సినిమా టైటిల్ పేరుతో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అంతటా పోస్టర్లు అంటించారు. ఏకంగా హైవేలపై భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు. 


రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి. రాజేంద్రనగర్‌ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినది ఎంత? అంటూ లెక్కలతో సహా భారీ హోర్డింగ్స్‌ పెట్టారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.44 కోట్ల 26 లక్షల రూపాయలు ఇచ్చిందని ఫ్లెక్సీలపై రాశారు. రాష్ట్రం కేవలం రూ.25 కోట్లు మాత్రమే కేటాయించిందని రెండింటిని పోల్చుతూ ఫ్లెక్సీలపై ముద్రించారు. హైదరాబాద్ శివారున ఉన్న శంషాబాద్‌, బండ్లగూడ మండలాల్లో ఏ గ్రామాలకు ఎన్ని నిధులు అందాయి అనే విషయాలను స్పష్టంగా పోస్టర్లలో పేర్కొన్నారు.