Dharmapuri Srinivas: సీనియర్ కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్, ఆయన పెద్ద కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మరో నేత మేడ్చల్ సత్యనారాయణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డీఎస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఎస్‌కు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ , పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి తదితరులు పార్టీలోకి ఆహ్వానించారు.


వీల్‌చైర్‌లో గాంధీ భవన్‌ కు వచ్చిన డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌‌లో తిరిగి చేరుతుండటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తన సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని అన్నారు. గత కొంత కాలంగా సంజయ్ చేరికపై సందిగ్ధత నెలకొంది. తండ్రి చొరవతో సంజయ్ చేరికకు మార్గం సుగమం అయింది. గతంలో డీఎస్ తో పాటుగా ఆయన కుమారుడు బీఆర్ఎస్‌లో చేరారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలోనే వీరు కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


తొలుత చేరట్లేదని లేఖ, వెంటనే చేరుతున్నట్లు ప్రకటన


డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత తాను కాంగ్రెస్‌లో చేరట్లేదని, తన పెద్ద కుమారుడు చేరతాడని లేఖ విడుదల చేశారు. ఆ తర్వాత కాసేపటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు డీఎస్ స్వయంగా ప్రకటించి వీల్ ఛైర్ లో గాంధీ భవన్ కు వచ్చారు. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరుతున్నా కాబట్టే గాంధీ భవన్ కు వచ్చానని.. రాహుల్ కు మద్దతు ఇచ్చేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నానని పేర్కొంది. తాను కాంగ్రెస్ వ్యక్తిని అని.. తనను ఎవరూ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. రాహుల్ పై అనర్హత వేటు వేసే వారికి అసలు అర్హత ఉందా అని, రాహుల్ ఊహించని దానికంటే గొప్పగా పని చేస్తున్నారని డీఎస్ అన్నారు.