Dharani: ధరణి సేవలను విస్తృతం చేయడంతో పాటు కొన్ని చిన్న చిన్న లోపాలను సవరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ లో పలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే కొన్ని కొత్త మాడ్యుల్స్ ను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా మరికొన్ని మాడ్యుల్స్ ను తీసుకువచ్చింది. భూ లావాదేవీలకు సంబంధించి సాంకేతికంగా ఎదురు అవుతున్న సమస్యలను అధిగమించేందుకు కొత్త మాడ్యుల్స్ అవసరమని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర సర్కారు.. ఈ మేరకు వాటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చేపడుతున్న చర్యల్లో భాగమే ఇది. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, వాటికి అదనంగా ఇప్పుడు మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం జోడించింది. ఆయా ఆప్షన్లతో జిల్లాల్లో నెలకొన్న భూ లావాదేవీల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. 


రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మాడ్యూల్స్



  • భూమి రిజిస్ట్రేషన్ సమయంలో దాని విస్తీర్ణం, మార్కెట్ విలువను తెలుసుకుని రిపోర్టును కూడా పొందే అవకాశాన్ని కొత్తగా కల్పించారు. 

  • భూమి క్రయ, విక్రయాల సమయంలో భూమి మార్కెట్ విలువను తెలుసుకునే వీలు కల్పించారు.

  • గిఫ్ట్, సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్లలో ఒక్కరికే కాకుండా ఎక్కువ మంది కొనుగోలు చేసేలా, విక్రయించేలా అవకాశాన్ని తీసుకువచ్చారు. 

  • ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లోని వారు బ్యాంకుల్లో మార్టిగేజ్ లకు కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలనే నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు.

  • పేరు, లింగం, ఆధార్, కులం కేటగిరీ మార్పులు చేర్పులకు టీఎం 33 మాడ్యుల్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

  • పట్టా భూముల పత్రాల్లో అసైన్డ్ అని నమోదు అయితే భూమి రకం, భూమి వర్గీకరణ, భూమి సాగుకు సంబంధించిన టీఎం 33 మాడ్యుల్ కింద పరిష్కారం చూపనున్నారు. ఇందులో అసైన్డ్ భూములకు మినహాయింపు ఇచ్చారు.

  • సీసీఎల్ఏ, కలెక్టర్ లాగిన్లలో గ్రామ పహాణీ రిపోర్టులను అందుబాటులోకి తీసుకు వచ్చారు.

  • పట్టా పాసు పుస్తకాల్లో నమోదు అయిన వివరాలు సరిచేయడానికి వచ్చిన దరఖాస్తుల్లో ఏవైనా తేడాలు ఉంటే వాటిని తిరస్కరించకుండా అవకాశం కల్పించడానికి, ఆయా జాబితాలు కలెక్టర్లకు అందుబాటులోకి రానున్నాయి.


Also Read: BRICS Summit 2023: తెలంగాణ కళాఖండం, నాగాలాండ్ శాలువా - బ్రిక్స్ సమ్మిట్‌లో దేశాధినేతలకు మోదీ బహుమతులు


ధరణిలో గత నెల చేసిన మార్పులు చేర్పులు



  • డిలిటేషన్ ఆఫ్ ఫిక్టీషియ్ సర్వే గతంలో అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల ధరణిలోకి చేరిన నకిలీ సర్వే నంబర్లు, ఒకే నంబర్ రెండుసార్లు నమోదు కావడం వంటి వాటిని పరిష్కరించే వెసులుబాటు కల్పించారు.

  • కంపెనీలకు మంజూరు చేసిన పట్టాదారు పాసు బుక్ లో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశం కల్పించారు. 

  • గతంలో సీడింగ్ సమయంలో అధికారుల తప్పిదం వల్ల ఒకరి భూమికి మరొక వ్యక్తి ఆధార్ అనుసంధానం అయింది. దీనిని సవరించే అవకాశం కల్పించారు. 

  • పట్టా భూముల్లో నాలా కన్వర్షన్ అయిన భూములు, ఇంటి జాగాలకు సర్వే నంబర్లు కేటాయించలేదు. అలాంటి వాటికి సర్వే నంబర్లు ఇచ్చేందుకు కొత్త మాడ్యుల్ తీసుకువచ్చారు.

  • రైతులు భూమిలో కొంత అమ్మినా.. రైతు ఖాతాలో అలాగే ఉండిపోయేది. అలాంటి వాటిని గుర్తించి సవరించే అవకాశాన్ని తీసుకువచ్చారు.