Family Planning Operation Failed: ఈనెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు జాతీయ స్థాయిలో జరిపే క్యాంప్ లో భాగంగా నిర్వహించామని తెలంగాణ డీహెచ్ శ్రీనివాస రావు అన్నారు. డబుల్ పoక్చర్ లాప్రోస్కాపి, ట్యుబెక్టమి, వేసెక్టమి నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఆశా వర్కర్ల ద్వారా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. ఇబ్రహీం పట్నంలోని సీహెచ్ సీలో 34 మందికి నిష్ణాతులు సర్జరీ చేశారని ఆయన వివరించారు. దురదృష్టవశాత్తు నలుగురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. శస్త్రచికిత్స జరిగిన 30మందిని మళ్ళీ స్క్రీనింగ్ చేశామన్నారు. స్పెషల్ మెడికల్ టీంలను రోగుల ఇళ్లకు పంపినట్లు వెల్లడించారు. వారిలో కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒక ఆస్పత్రి లో ఉంచినట్లు పేర్కన్నారు. మరికొందరిని నిమ్స్ లో కూడా చేరిచ్చినట్లు శ్రీనివాస రావు తెలిపారు. అలాగే చనిపోయిన నలుగురు మహిళల కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రకటించారు. 


విచారణ కమిటీ వేసిన ప్రభుత్వం.. 
దేశంలో 75సంవత్సరాల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇప్పటివరకు 502 క్యాంపులు నిర్వహించామని.. మహిళలు తమకు తాముగా స్వచ్ఛందంగా ఈ క్యాంపులకు వచ్చి ఆపరేషన్లు చేయించుకుంటారని అన్నారు. ఈ ఏడాది లో 111 ఫిక్స్డ్ డే సర్జరీ లు చేశామని... ఇబ్రహీంపట్నంలో సర్జరీ చేసిన వైద్యులకు గతంలో వేల సంఖ్యలో సర్జరీలు చేసిన అనుభవం ఉందన్నారు. ఇబ్రహీంపట్నం సీహెచ్ సీ సూపరింటెండెంట్ ని లైఫ్ టైం సస్పెన్షన్, సర్జరీ చేసిన వైద్యులపై తాత్కాలిక సస్పెన్షన్ విధించామని వెల్లడించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిటీ వేసిందన్నారు. ఇందుకు ఎంక్వైరీకీ  తననే నియమించారని స్పష్టం చేశారు. వారం రోజుల్లో విచారణ పూర్తి చేస్తామన్నారు.


అసలేం జరిగిందంటే..? 
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. ఆగస్టు 25వ తేదీన 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా వీరిలో నలుగురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఓ మహిళ ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. ఆపై మరో మహిళ చనిపోయారు. మరో ఇద్దరు మహిళల ఆరోగ్యం విషమించింది. వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా నేడు చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆపరేషన్ వికటించి సంభవించిన మరణాల సంఖ్య 4కు చేరింది. అయితే లావణ్య ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ పరిధిలోని సీతారాం పేటకు, మౌనిక కొలకులపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బృంగి హాస్పిటల్ లో ఒకరు, ఇబ్రహీంపట్నం లోని టీమ్స్ హాస్పిటల్ లో సుష్మ చనిపోగా, ఒవైసీ లో మరొకరు చనిపోయినట్లు సమాచారం.


నలుగురు నాలుగు ప్రైవేటు ఆస్పత్రుల్లో... 
మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, మంచాల మండలం లింగంపల్లిలికి చెందిన సుష్మతో పాటు ఇబ్రహీంపట్నం సమీపంలోని సీతారంపేటకు చెందిన లావణ్య, కొలకులపల్లి చెందిన మౌనికలు ఆపరేషన్ చేయుంచుకొని ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. మమతను బీఎన్ రెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, సుష్మను ఇబ్రహీంపట్నంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సీతారాంపేటకు చెందిన లావణ్యను హైదరాబాద్ లోని ఓవైసీ ఆస్పత్రిలో చేర్పించగా.. మౌనికను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ మమత ఆదివారం చనిపోగా.. సుష్మ సోమవారం వేకువజామునే ప్రాణాలు కోల్పోయింది. ఒక రోజు వ్యవధిలో ఇద్దరు చనిపోగా.. నేడు మరొకరు చనిపోవడం స్థానికంగా విషాధాన్ని నింపింది. 


వైద్యుల నిర్లక్ష్యమే కారణం.. - 
ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళలు చనిపోయారంటూ బాధిత కుటుంబాలు, వివిధ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ నియంత్ర ఆపరేషన్ ఫెయిల్ అయి నలుగురు మహిళలు చనిపోవడం బాధాకరం అన్నారు. చనిపోయిన నలుగురికి ఇద్దరిద్దరు చొప్పున పిల్లలు ఉన్నారు. తల్లులు లేకుండా వారి పిల్లలను ఎలా పెంచాలంటూ మృతురాళ్ల భర్తలు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందేళ్లు పిల్లాపాపలతో కలిసి హాయిగా జీవించాలనుకున్న తమకు తీరని శోకాన్ని మిగిల్చిన వైద్యులపై కన్నెర్ర చేస్తూనే కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.