caste census in Telangana | హైదరాబాద్: తెలంగాణలో వచ్చే నెల నుంచి కుల గణన చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణన దేశవ్యాప్తంగా ఒక మోడల్ గా నిలుస్తుందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో సోమవారం నాడు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. కుల గణన (Caste Census)లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారితో చర్చలు జరిపారు.
మంగళవారం నాడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్
తెలంగాణలో వచ్చే నెల నవంబర్ 6 నుంచి చేపట్టనున్న కులగణనకు సంబంధించి దిశా నిర్దేశం చేయడానికి నేడు (అక్టోబర్ 29) కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి అభిప్రాయాన్ని ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేస్తే బాగుంటుందని అధికారులు సలహా అడిగారు. 300 మంది సామాజికవేత్తలు, మేధావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వీరితో పాటు కుల సంఘాలు, యువజన సంఘాలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. వీరితో పాటు బీసీ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. ప్రణాళిక శాఖ రూపొందించిన ప్రశ్న పత్రం సమగ్రంగా ఉందని సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ లాంటి మేధావులు అభినందించారని భట్టి విక్రమార్క తెలిపారు.
కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల హామీ ప్రకారం కుల గణన
మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కుల గణన చేస్తామని కామారెడ్డి లో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో ప్రకటించామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చిన హామీకి కార్యరూపం తీసుకువచ్చామని తెలిపారు. పాత కమిషన్ కాలం ముగిసిన వారంలోపే కొత్త బీసీ కమిషన్ వేశాం, బీసీ సంక్షేమం అభ్యున్నతి పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. ఇప్పటికే 4 జిల్లాల్లో 56 ఇండ్లు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని కులగణన సర్వే పూర్తి చేశామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రొఫెసర్ మురళి మనోహర్ న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోజుకు ఒక ఎన్యుమరేటర్ 15 ఇండ్లు సర్వే చేయడం భారం అనుకుంటే ఆ సంఖ్యను 10కి కుదించాలని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మంత్రులకు సూచించారు. కులగణనకు సంబంధించి జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ సింహాద్రి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సామాజిక విశ్లేషకుడు పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.