Delhi Liquor Scam: ఆఖరి నిమిషంలో ఈడీకి షాక్ ఇచ్చారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్‌ విచారణలో ఉన్నందున ఇవాళ్టి విచారణకు హాజరుకాలేనని సమాచారం అందించారు. తన తరఫున న్యాయవాదులను ఈడీ ఆఫీస్‌కు పంపించి సమచారం అందించారు. 


ఢిల్లీలోని కేసీఆర్‌ నివాసం వద్ద ఈ ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ నడిచింది. ఎమ్మెల్సీ కవిత రెండోసారి ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండటంతో ఏం జరగబోతుందో అన్న టెన్షన్ ఆ పార్టీకి చెందిన నేతల్లో కనిపించింది. కాసేపట్లో కవిత బయల్దేరి విచారణకు వెళ్లనున్నారన్న టైంలో ఈడీ ఆఫీస్‌లో ఆమె తరఫున లాయర్లు ప్రత్యక్షమయ్యారు. కవిత ఇచ్చిన సమాచారాన్ని ఈడీకి అందజేశారు. 


మొన్నటి విచారణలో నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు కొన్ని వివరాలు అడిగారని...అయితే వ్యక్తిగత హాజరు కావాలని మాత్రం చెప్పలేదన్నారు. అందుకే ఆ వివరాలును లాయర్ ద్వారా పంపిస్తున్నానని.. తాను మాత్రం ఇవాళ్టి(మార్చి 16) విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు కవిత. మరో తేదీ చెప్పాలని అప్పుడు కచ్చితంగా విచారణకు హాజరవుతారని  రిక్వస్ట్ చేశారు. దీనిపై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు వేచి చూడాలి.


మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారించడంపై కవిత న్యాయపోరాటం చేస్తున్నారు. బుధవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తక్షణమే దీన్ని విచారించాలని అభ్యర్థన పెట్టుకున్నప్పటికీ కోర్టు ఆమె రిక్వస్ట్‌ను తిరస్కరించింది. దీంతో ఇవాళ్టి విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం మహిళలను వారి ఇంటికే వెళ్లి విచారించాలని రూల్స్ ఉన్నాయని.. దీనికి వ్యతిరేకంగా తనను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారించిందని సుప్రీం కోర్టుకు తెలిపారు కవిత. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న కవిత అభ్యర్థను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. మార్చి 24న విచారిస్తామని తెలిపింది. అందుకే తాను విచారణకు హాజరుకాలేననే చెప్పారు.  


ఈడీకి రాసిన లేఖలో కవిత చాలా అంశాలు ప్రస్తావించారు. ఆఫీస్‌కు పిలిచి మహిళలను విచారించవద్దని... ఆడియో, వీజడియో విచారణకు తాను సిద్ధణని ప్రకటించారు. అధికారులు తన నివాసానికి వచ్చి విచారించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణకు సహకరించానని... తనకు తెలిసినవి ఈడీకి చెప్పినట్టు లేఖలో తెలిపారు. 11న విచారించిన అధికారులు మళ్లీ 16న విచారణ ఉంటుందని సమాచారం ఇచ్చారని అయితే వ్యక్తిగతంగా హాజరవ్వలని మాత్రం చెప్పలేదన్నారు. వాళ్లు అడిగిన వివరాలను తన లాయర్‌ భరత్ ద్వారా పంపిస్తున్నట్టు లేఖలోవివరించారు. తన హక్కుల రక్షణ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశానని... దాని విచారణ ఈనెల 24న ఉందన్నారు. ఆ విచారణ తర్వాత అవసరమైతే ఈడి ఎదుటకు వస్తానని పెర్కొన్నారు. 


మరోవైపు ఈ కేసులో కీలకమైన వాంగ్మూలం ఇచ్చిన పిళ్లై కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. మరో నిందితుడు ఆప్‌ నేత సిసోడియా కస్టడీ కూడా రేటితో ముగియనుంది. వీళ్ల ముగ్గురిని ఒక చోట పెట్టి విచారించాలని అందుకే కవితకు ఇవాళ నోటీసులు ఇచ్చారని సమాచారం. కానీ కవిత విచారణకు హాజరుకాలేదు. ఇప్పుడు ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ మొదలైంది.