ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణలో మరో సంచలనం. సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆమెను ఈడీ విచారిస్తోంది. ఈ సందర్భంగా అటు  హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. 


ఎప్పుడు ఏం జరుగుతోంది. ఈడీ విచారణలో కవిత ఎలాంటి సమాధానాలు చెప్పనున్నారు. అసలు ఈడీ సంధించే ప్రశ్నలు ఎలా ఉంటాయనేదానిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఫిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోపాటు ఇప్పటి వరకు అరెస్టైన వ్యక్తులు, వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాలతో దొరికిన క్లూస్ ఆధారంగా నేటి విచారణ జరిగే ఛాన్స్ ఉంది. 


శుక్రవారం సాయంత్రం నంచి ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో చాలా ఉద్విగ్న వాతావరణం కనిపించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు సాధన దీక్ష కోసం వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లు ఆమెతో సమావేశమయ్యారు. బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు, విచారణ జరుగుతోందని ఆరోపించారు. సాయంత్రానికి మంత్రులు కేటీఆర్, హరీష్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ తోపాటు పలువురు న్యాయనిపుణులు ఢిల్లీ చేరుకొన్నారు. ఈడీ విచారణపై సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. 


ఈ కేసులో కీలకంగా మారిన అరుణ్‌ పిళ్లైతో కలిపి ఎమ్మెల్సీ కవితను విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో పిళ్లై స్టేట్‌మెంట్‌ కీలకంగా భావిస్తోంది ఈడీ. అందుకే ఆయన్ని ఎదురుగా ఉంచి ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా కవితను విచారించే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 


పిళ్లైను మంగళవారం (మార్చి 7) అరెస్టు చేసిన ఈడీ అధికారులు అదే రోజు ఢిల్లీలోని స్పెషల్ కోర్టులో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిపోర్టులో ఈ ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. సౌత్ గ్రూప్‌లో పార్టనర్స్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా మరికొంత మంది ఉన్నారు. దీనికి బయట ప్రతినిధులుగా పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు వ్యవహరిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.


మరోవైపు ఈడీ విచారణకు వెళ్లి కవితకు మద్దతుగా బీఆర్‌ఎస్ లీడర్లు ట్వీట్‌లు చేస్తున్నారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయని ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అంత మాత్రాన వేట ఆపుతామా? అంటూ ప్రశ్నించారు. కేసిఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నామంటూ భరోసార ఇచ్చారు. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే అంటూ ట్వీట్ చేశారు.