Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై తాను అప్రూవర్ గా మారలేదని చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్‌గా మారారని వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అని వివరించారు. ఈ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్న వారు.. నిజానిజాలేంటో తెలుసుకోవాలని రామచంద్ర పిళ్లై తరఫు న్యాయవాదులు సూచించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద అరుణ్ పిళ్లై ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు, కథనాలు ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ కవిత బినామీ అంటూ పిళ్లైపై అభియోగాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ మేరకు 164 కింద ఈడీ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇచ్చారని పలు వెబ్ సైట్లు, టీవీలు, పేపర్లలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పిళ్ళై నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టారని రాసుకొచ్చారు. కానీ వీటన్నిికీ చెక్ పెడుతూ... పిళ్లై తాను అప్రూవర్ గా మారలేదని, ఇవన్నీ తప్పుడు వార్తలనీ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అరుణ్ రామచంద్రన్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. గత మార్చి 7న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.
ఈ కేసులో ఇప్పటికే సౌత్ గ్రూపులోని పలువురు సభ్యులు అప్రూవర్‌గా మారారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై కంటే ముందుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్స్‌గా మారిన వారిలో ఉన్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడి నుంచి ఎక్కడకు పంపించారు? కీలకంగా వ్యవహరించింది ఎవరు? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల అప్రూవర్‌గా మారిన మాగుంట
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాల వ్యక్తుల నుంచి ఢిల్లీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు పెద్ద మొత్తంలో డబ్బు అందినట్టు భావిస్తోంది. మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది.
ఢిల్లీ మద్యం కేసులో తొలుత శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారగా, ఆయన తర్వాత మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారారు. ప్రస్తుతం వీరిద్దరూ బెయిల్‌పై బయట ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి అప్రూవర్లుగా మారడం ఊహించని పరిణామమేనని విశ్లేషకులు అంటున్నారు. అప్రూవర్‌గా మారిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన సమాచారంతో ఈడీ దూకుడు పెంచింది. పలువురు కీలక వ్యక్తులను విచారించింది. ఈడీ విచారణలో మాగుంట కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది.