Danam Nagender has once again expressed his anger over the demolition of Hydra:  బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రాపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  చింతల్ బస్తీలో  షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న ఆక్రమణలను హైడ్రా అధికారులు బుధవారం కూల్చివేశారు.  కూల్చివేతలను అడ్డుకున్న దానం నాగేందర్ అధికారులపై మండిపడ్డారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడినుంచో బ్రతకడానికి వచ్చినోళ్లపైపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తానని హెచ్చరించారు. 


హైడ్రా కూల్చివేతల విషయంలో దానం నాగేందర్ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. జూబ్లిహిల్స్ లో ఓ పార్కు ఆక్రమణను తొలగించినప్పుడు ధర్నా చేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ  కార్యక్రమాలపై బహిరంగ విమర్శలు వద్దని ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని ఆయనకు కాంగ్రెస్ అగ్రనేతలు స్పష్టం చేశారు. అయితే కొంత కాలం సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు మరోసారి హైడ్రాపై విరుచుకుపడుతున్నారు. తన నియోజకవర్గంలో అసలు హైడ్రా అడుగు పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడు నేరుగా అధికారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై గతంలో చాలా సార్లు సీరియస్ విమర్శలు చేశారు. 


బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం జరుగుతోందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని దానం యూట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్ోల చెబుతున్నారు.  ఓటు బ్యాంకు అయిన ప్రజలను కాపాడుకోవాలని ..హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని ఆయనంటున్నారు. మన మీద నమ్మకం లేదని, ఇప్పుడైనా దానిని పెంచుకునే ప్రయత్నం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ కు సలహా ఇవ్వడం సంచలనంగా మారింది. 


అదే సమయంలో ఆయన కొంత మంది అధికారుల తీరుపై మండిపడుతున్నారు. తాను కాంగ్రెస్ లో చేరినా తన మాట వినడం లేదని..  కేసులు పెడతానంటూ బెదిరించడం వల్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెడ్డపేరు వస్తుందని అంటున్నారు. అదే సమయంలో  ‘ఫార్ములా ఈ’ కార్ రేసులో కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడారు.  ఫార్ములా ఈ కార్ రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెబుతున్నారు  ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని, ఈ రేసుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగామని పేర్కొన్నారు.ఇప్పుడు నేరుగా హైడ్రాపై విరుచుకుపడ్డారు.  దానం తీరు కాస్త తేడాగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గుసగుసలాడుకుంటున్నారు.                     


Also Read:  అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?