Telangana Government Committee On Saroornagar Kidney Rocket: హైదరాబాద్‌లో (Hyderabad) కిడ్నీ రాకెట్ ముఠా వ్యవహారం కలకలం రేపింది. సరూర్‌నగర్‌ డివిజన్‌లోని అలకనంద (Alakananda Hospital) మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి సర్జరీలు జరుగుతున్నాయనే సమాచారంతో మంగళవారం రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, పోలీసులు దాడులు చేశారు. తనిఖీల్లో ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు నలుగురినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బులు ఆశ చూపి, ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో వైద్యాధికారులు పోలీసుల సహకారంతో తనిఖీలు చేపట్టి గుట్టు రట్టు చేశారు.

విచారణకు కమిటీ

అటు, ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రత్యేక కమిటీ వేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయగా.. మల్లికార్జున్, కిరణ్మయి, సాధనరాయ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు అలకనంద ఆస్పత్రిని సందర్శించారు. కిడ్నీ రాకెట్‌లో అసలు నిజాలు రాబట్టనున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న బాధితులను సైతం వీరు కలిసి వివరాలు సేకరించనున్నారు.

కాగా.. సరూర్‌నగర్ డాక్టర్స్ కాలనీలో 6 నెలల క్రితం అలకనంద ఆస్పత్రి ప్రారంభమైంది. జ్వరం, ఇతర చిన్న చికిత్సలు చేసేందుకు మాత్రమే ఆస్పత్రికి అనుమతి ఉంది. కానీ, అనధికారికంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నట్లు సమాచారం రావడంతో వైద్యాధికారులు గీత, అర్చన, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి మంగళవారం ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో నలుగురు చికిత్స తీసుకుంటూ కనిపించారు. వీరు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నీలు ఇవ్వగా.. వాటిని కర్ణాటకకు చెందిన ఇద్దరు రోగులకు అమర్చినట్లు విచారణలో తేలింది. బాధితులను మరింత స్పష్టత కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిని సీజ్ చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు ప్రకటించారు. సరూర్‌నగర్ ఠాణాలో కేసు నమోదు చేశారు. తాజాగా, ఈ ఘటనపై ప్రభుత్వం కమిటీ వేసింది.

Also Read: Hanumakonda Murder Case: హనుమకొండలో పట్టపగలే దారుణం, నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ దారుణహత్య