NTR Trust Euphoria Musical Night: ఫిబ్రవరి 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియలో ‘ఎన్టీఆర్ ట్రస్ట్ యూపోరియా మ్యూజికల్ నైట్’‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షో వివరాలు తెలిపేందుకు మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఈ మ్యూజికల్ నైట్ గురించి ఆమె చెప్పిన విషయాల కంటే కూడా.. సంగీత దర్శకుడు తమన్‌ని ఆమె పిలిచిన విధానమే హైలెట్ అవుతోంది. ఇంతకీ ఆమె తమన్ ఏమని పిలిచారో తెలుసా.. నందమూరి తమన్. అవును స్వయంగా ఈ మాట ఆమె నోటి వెంట రావడంతో.. ఒక్కసారిగా మీడియా కూడా ఆశ్చర్యపోయింది. నిజంగా ఆమె అంది అనే కాదు కానీ.. ఆ పేరుకు తమన్ అర్హుడు కూడా. అదెలా అనుకుంటున్నారా?

నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే చాలు రెడ్ బుల్ ఎక్కించినట్లుగా తమన్ రెచ్చిపోతుంటాడు. ఇప్పటి వరకు బాలయ్య, తమన్ కాంబోలో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌గా ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలియంది కాదు. ‘అఖండ’ సినిమాకు అయితే థియేటర్ల వాళ్లు బోర్డులు పెట్టారు. సౌండ్ బాక్సులు బద్దలవుతున్నాయంటూ వెలిసిన బోర్డులతో తమన్ సంగీతం పవర్ ఏంటో తెలిసొచ్చింది. రీసెంట్‌గా వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమాకు కూడా తమన్ మ్యూజిక్కే ప్రాణం పోసిందనేలా విమర్శకులు సైతం నొక్కి వక్కాణించారు. విమర్శకులు, ప్రేక్షకులే కాదు.. స్వయంగా బాలయ్య నోటి వెంటే తమన్ గురించి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో అయితే.. నందమూరి తమన్ డ్యూటీ ఎక్కేశాడు అంటూ నందమూరి అభిమానులు ఒకటే పోస్ట్‌లు. తమన్‌కి గుడి కూడా కట్టేస్తామనేలా కొందరు చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి కూడా. అది, ప్రస్తుతం తమన్ రేంజ్. అందుకే తమన్‌తో విజయవాడలో ఎన్టీఆర్ పాటలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ మ్యూజికల్ నైట్‌ని ఏర్పాటు చేస్తోంది. అసలింతకీ నారా భువనేశ్వరి ఏమన్నారంటే.. 

Also Read'గేమ్ ఛేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... రామ్ చరణ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా?

‘‘నాన్నగారు నందమూరి తారక రామారావు.. అలా పిలిస్తే అందరూ ఒప్పుకోరు.. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారంటే అంతా ఇష్టపడతారు. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన మహోన్నత వ్యక్తి. ప్రజలే దేవుళ్ళు అని భావించి, బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమీ ఆశించకుండా పాలిటిక్స్‌లోకి వచ్చారు. రెండు రూపాయలకి కిలో బియ్యం, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు.. ఇలా ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ఎంతో ధైర్యంతో ముందుకు తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మన ప్రజా నాయకుడు నారా చంద్రబాబునాయుడుగారు ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్యం అందుబాటులో వుండాలని ఎన్టీఆర్ మెమొరియల్ ట్రస్ట్‌ని  స్థాపించారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం సహాయం తీసుకోకుండా 28 ఏళ్లుగా ఈ ప్రయాణం కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఆశయాలని ఈ ట్రస్ట్ ముందుకు తీసుకెళుతూనే ఉంటుంది. ఆయన కలలని నెరవేర్చడానికి మేము ఎప్పుడూ ముందుంటాం. 2013లో వచ్చిన పైలన్ తుఫాన్, 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్,  2018 కేరళలో వచ్చిన తుఫాన్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంతో సహాయం అందించింది. ట్రస్ట్ ద్వారా ప్రజాసేవలో అందరికంటే ముందుంటాం. 

ఇక ఈ మ్యూజికల్ నైట్ షో కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా.. జెనిటిక్ డిజార్డర్ తలసేమియాతో చాలా మంది పిల్లలు, పెద్దలు బాధపడుతున్నారు. ఈ వ్యాధి వున్న వారికి బ్లడ్‌లో హిమోబ్లోబిన్ చాలా తక్కువగా వుంటుంది. ఒక్కో సమయంలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇది తీవ్రంగా వచ్చినప్పుడు వెంటనే రక్త మార్పిడి జరగాలి. దీనికి చాలా రక్తం అవసరం అవుతుంది. బ్లడ్ డొనేషన్ పై ప్రజల్లో చాలా అపోహలు వున్నాయి. బ్లడ్ డొనేషన్ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. నిపుణులు అన్ని పరిశీలించిన తర్వాతే బ్లడ్ తీసుకుంటారు. బ్లడ్ డొనేషన్ అనేది ఈ సొసైటీలో చాలా గొప్ప డొనేషన్. మీరు ఇచ్చే ప్రతిరక్తపు బిందువు చాలా జీవితాలని నిలబెడుతుంది. అది ప్రజలు గుర్తించాలి. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆలోచిస్తూ.. ఎలా తీసుకెళ్లాలో అనే ఆలోచనలో ఉన్న మాకు ముందు గుర్తుకు వచ్చింది తమన్.. సారీ నందమూరి తమన్ గారు. మా టీమ్ ఆయన్ని కలిసిన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆయన ఒప్పుకున్నారు. మా ట్రస్ట్ తరపున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షోని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా వచ్చి ఈ షోలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. టికెట్స్ బుక్ మై షోలో అందుబాటులో వుంటాయి. ఈ షో కోసం ఆడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది. దానికి నేను గ్యారెంటీ. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

అనంతరం సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చంద్రబాబు వంటి మహానీయులు స్థాపించిన ట్రస్ట్ అంటే ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం ఫిబ్రవరి 15న మేము మ్యూజికల్ కన్సర్ట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈ షోలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. భువనేశ్వరి మేడమ్ చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. చంద్రబాబు నాయుడుగారు చేసిన అభివృద్ధి మనం చూశాం. ఏపీని ప్రగతిపధం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌గారి ధన్యవాదాలు. ఈ మ్యూజికల్ షోలో సీనియర్ ఎన్టీఆర్ గారి పాటల నుంచి ఇప్పటి ట్రెండ్ పాటల వరకూ అన్నీ వుంటాయి. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రిహార్సల్స్ మొదలు పెడతాం. ఈ మ్యూజికల్ కన్సర్ట్ చాలా క్రేజీగా ఉండబోతోందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈవో రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నారా భువనేశ్వరిగారు చేపడుతున్నారని అన్నారు.

Also Read: అఖిల్ అక్కినేని పెళ్లికి ముహూర్తం ఫిక్స్... వెడ్డింగ్ డేట్, వెన్యూ వివరాలు తెలుసా?