Cyberabad CP: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలు నీటిమునిగాయి. ఈక్రమంలోనే ప్రత్యక చర్యలు తీసుకుంటున్న అధికారులు.. ప్రజలకు అనేక రకాల సూచనలు చేస్తున్నారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కారిడార్ లో కంపెనీలకు ప్రత్యేక లాగౌట్ సమయాన్ని మరో రెండు వారాల పాటు పొడగిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయ చర్యలపై కమిషనరేట్ లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ద్వారా కొన్ని చెరువుల్లో ప్రవాహ తీరు పరిశీలించారు. అదనపు కమిషనర్ అవినాష్ మహంతి, ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ నారాయణ నాయక్, క్రైమ్స్ డీసీపీ కల్వేశ్వర్ సిగెనవార్, డీసీపీలు హర్ష వర్ధన్, సందీప్ తదితరులు ఉన్నారు.
వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటున్న ఐటీ కారిడార్ ఏరియాలో ఉద్యోగులు లాగౌట్ చేయడంపై పోలీస్ శాఖ కీలక సూచనలు చేసింది. ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది. కంపెనీల వివరాలను ఇలా పేర్కొన్నారు. ఇప్పటికైనా లాగౌట్ చేయనివారు పోలీస్ శాఖ సూచనలు పాటించాలని అధికారులు చెప్పారు. ఇది రెండు రోజులకే అని ఆరోజు ఆదేశాల్లో చెప్పారు. కానీ ఇంకా వర్షాల ప్రభావం ఉండటంతో మరో రెండు వారాలకు పొడిస్తున్నట్టు చెప్పారు.
ఫేజ్ - 1 ప్రకారం.. ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగౌట్ చేసుకోవాలని సూచించారు.
ఫేజ్ - 2 ప్రకారం.. ఐకియా నుంచి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ సంబంధిత ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవడం బెటర్.
ఫేజ్ - 3 ప్రకారం.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ కంపెనీల ఉద్యోగులు సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల మధ్య లాగౌట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది.