Data Center in Hyderabad | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. ఇదివరకే యూనిలీవర్, హెచ్‌సీఎల్ లాంటి దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ (CtrlS) ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economin Forum)లో భాగంగా రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంట్రోల్ ఎస్ సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు.
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్
తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ బృందంతో భేటీ అనంతరం సంతకం చేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ (Artificial Data Center) క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ రూ. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఓవరాల్ గా 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలంగాణ ప్రతినిధులు అంచనా వేశారు.
ఈ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో కంట్రోల్ ఎస్ వారు నెలకొల్పనున్న ఈ డేటా సెంటర్ మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఐటీ సేవల సామర్థ్యం తెలంగాణలో పెరుగుఉందని, నగరంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో తెలంగాణ ఐటీ సేవలలో మరింత వృద్ది సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సాంకేతిక అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం చేసుకోవడంపై గర్వంగా ఉందన్నారు.
తెలంగాణకు వచ్చిన పెట్టబడులు ఇవే..
యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వినియోగ వస్తువుల తయారీలో యూనిలీవర్‌కు మంచి పేరుంది. కామారెడ్డిలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుతో పాటుు బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు యూనిలీవర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆపై టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ సైతం హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చింది. 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ సెంటర్ ఏర్పాటుతో 5000 మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.