CPI Narayana Comments On Chiranjeevi: ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.నారాయణ ప్రకటించారు. మెగా అభిమానులు తాను చేసిన కామెంట్స్‌ను మర్చిపోవాలని కోరారు. ఆయనపై తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానంటూ చెప్పారు. చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలు బాషా దోషంగా భావించాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరిచిపోవాలని కోరారు. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు చేస్తుటామని, చిరంజీవి గతంలో రాజకీయాల్లో ఉన్నారని, రాజకీయాల్లో విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకోవాలని అన్నారు. అయినా, చిరంజీవిపై తాను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని నారాయణ అన్నారు.


సీపీఐ నారాయణ నిన్న (జూలై 19) తిరుపతి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిరంజీవిపై విపరీతమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహా విష్కరణకు చిరంజీవి హాజరుకావడాన్ని తప్పుపట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటి వాడని నారాయణ అభివర్ణించారు. చిల్లర బేరగాడు, బ్రోకర్ అంటూ పరుష పదజాలం వాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామరాజుగా నటించి అల్లూరి అసలు ఎలా ఉంటారో పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను ఆ సభకు పిలవకుండా చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని నారాయణ మండిపడ్డారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని నారాయణ అన్నారు. 


అయితే, చిరంజీవి, పవన్ కల్యాణ్ పై నారాయణ చేసిన వ్యాఖ్యలపై మెగా మెగా అభిమానులతో పాటు, నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇక చేసేది ఏమీ లేక తన వ్యాఖ్యలను నారాయణ వెనక్కి తీసుకున్నారు నారాయణ. నాగబాబు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 


‘‘ఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి కాస్త అన్నం పెట్టండి! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు.’’ అంటూ నాగబాబు ట్విటర్ లో స్పందించారు. దీంతో వివాదం మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన నారాయణ మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.