తెలంగాణ...పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతున్న రాష్ట్రానికి...అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి  చూపిస్తున్నాయ్. తాజాగా మెటీరియల్‌ సైన్సెస్‌ లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్‌ సంస్థ...తెలంగాణ పెట్టుబడులు పెట్టబోతోంది. దేశంలో మొదటిసారి స్మార్ట్‌ఫోన్‌లకు వినియోగించే... గొరిల్లా గ్లాస్‌ తయారు చేయడానికి ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది.  అమెరికా పర్యటిస్తున్న పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్....కార్నింగ్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జాన్‌ బేన్‌, గ్లోబల్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ రవికుమార్‌, ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్‌ సారా కార్ట్‌మెల్‌తో సమావేశం అయ్యారు. 


రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబ‌డి పెట్టేందుకు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. కార్నింగ్ కంపెనీ ప్ర‌తినిధుల‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. దేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారు చేసేందుకు... తెలంగాణ‌లో తయారీ ప్లాంట్‌ను నెల‌కొల్పాల‌ని నిర్ణయించుకుంది. ఇది ఎంతో సంతోషంగా ఉంద‌ంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా స్మార్ట్‌ పోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో ఇది వ్యూహాత్మక పెట్టుబడి అని కేటీఆర్‌ తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుతో 800 మందికి ప్ర‌త్య‌క్ష ఉపాధి ల‌భించనుంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్...అమెరికాలో పర్యటిస్తున్నారు.






హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరిగిన బయో ఆసియాలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయ్. ఫార్మాస్యూటికల్‌ ప్యాకేజింగ్‌ రంగంలో దిగ్గజ ఉత్పత్తి సంస్థ అయిన ఎస్‌జీడీ, మెటీరియల్‌ సైన్సులో గ్లోబల్‌ లీడర్‌ అయిన కోర్నింగ్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ సంస్థలతో తెలంగాణ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఫార్మాస్యూటికల్‌ ప్యాకేజింగ్‌ లో  దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడితో మహబూబ్‌నగర్‌ జిల్లాలో యూనిట్‌ను నెలకొల్పనున్నాయి.  అమెరికాకు చెందిన జూబిలెంట్‌ సంస్థ రూ.1,000 కోట్లు, ఫ్రాన్స్‌ సంస్థ సనోఫి రూ.250 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయ్. 


అమెరికాకు చెందిన ఫాక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మాస్యూటికల్‌ సంస్థ....200 కోట్లతో తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించింది.  ఇప్పటికే ఈ కంపెనీ తమ మొదటి అంతర్జాతీయ ఉత్పత్తి సంస్థను రాష్ట్రంలో ప్రారంభించింది.  గొట్టాలు, బ్యాగ్‌లు, బాటిళ్లు, ఫ్లాస్కులు, ప్లాస్టిక్‌ ల్యాబ్‌వేర్‌ వంటి వస్తులను ఈ సంస్థ తయారు చేస్తోంది. ప్రపంచ దిగ్గజ బయోటెక్నాలజీ కంపెనీ ‘జెనెసిస్‌’ సైతం తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో 415 కోట్లు కంపెనీ పెట్టుబడి పెట్టింది. తాజాగా మరో రూ.497 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టనుంది. తాజా విస్తరణతో మరో 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.