భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. అయితే ఆయన అనుకున్నట్లుగానే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పార్టీ ప్రచారానికి అందుబాటులో లేకుండా, తాజాగా విదేశాల నుంచి వచ్చేశారు. వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా నుంచి తిరిగి రావడంతో ప్రస్తుతం పార్టీ నేతల్లో రెండు విషయాలపై చర్చ జరుగుతోంది. ఒకటి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో వెంకట్ రెడ్డి పాల్గొంటారా అని, రెండో విషయం ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులపై రేపటితో గడువు ముగియనుండటంతో.. ఆయన ఏ వివరణ ఇస్తారోనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు.


షోకాజ్ నోటీసులపై ఏమంటారో ! 
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సమయంలో అక్టోబర్ 21న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుటుంబంతో ఆస్ట్రేలియాకు వెళ్లారు. నిన్న మునుగోడు బై పోల్స్ ప్రచారం గడువు ముగియగానే భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డి విదేశాల నుంచి తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ నేతలు ఎవరితోనూ మాట్లాడటం లేదని, కలవడం లేదని సమాచారం. పార్టీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చాక, అనంతర పరిణామాలతో పార్టీ నేతలతో ఆయన మాట్లాడతారని తెలుస్తోంది. సోదరుడు రాజగోపాల్ రెడ్డికి సహకారం అందించాలని, ఉప ఎన్నికల్లో మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేతకు వెంకట్ రెడ్డి కాల్ చేసి మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ అధిష్టానం దీనిపై ఎంపీకి షోకాజ్ నోటీసులిచ్చింది. వివరణ ఇచ్చేందుకు పది రోజులు గడువు ఇవ్వగా, ఆ గడువు మరికొన్ని గంటల్లో గడువు ముగియనుంది. పార్టీ నుంచి క్లీన్ చిట్ వచ్చే వరకు పార్టీ నేతల్ని కలిసేందుకు వెంకట్ రెడ్డి రెడీగా లేరని సమాచారం.


మునుగోడులో ప్రచారానికి రావాలని, తనకు మద్దతు తెలపాలని పాల్వాయి స్రవంతి కొన్ని రోజుల కిందట వెంకట్ రెడ్డిని కోరారు. అయితే తన ఆశీర్వాదాలు ఉంటాయని ఎంపీ హామీ ఇచ్చారని స్రవంతి అప్పట్లోనే మీడియాకు తెలిపారు. కానీ ప్రచారం సమయంలో ఆస్ట్రేలియాకు వెళ్లి తాజాగా తిరిగొచ్చారు వెంకట్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని చెప్పవచ్చు. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది తమ తొలి విజయమని మునుగోడు విజయంపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ఉన్నారు.   


తొలుత ఆడియో, తరువాత వీడియోలు వైరల్ !
"రేపు ఏం జరిగినా రాజగోపాల్ రెడ్డి సాయం చేస్తాడు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. నేను పీసీసీ ప్రెసిడెంట్ అవుతాను. అన్నీ నేను చూసుకుంటా. ఈసారి పార్టీలకతీతంగా సాయం చేయండి. ఈ దెబ్బకు నేను పీసీసీ ప్రెసిడెంట్ అవుతా. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తాను. మనిషిని చూసి చేస్తున్నాం పార్టీ కాదు. ఈ ఒక్కసారికి పార్టీలు చూడకండి. నేను వచ్చి కలుస్తాను." అని కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్లు ఆడియోలో వాయిస్ ఉంది. ఆ తరువాత ఆస్ట్రేలియాకు వెళ్లిన వెంకట్ రెడ్డి.. తాను ప్రచారం చేసిన మునుగోడులో ఏ లాభం లేదని, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదన్నారు. ఈ వీడియో సైతం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపింది.