ప్రతిపక్షాల తీరు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా ఉందన్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి. గతవారం రోజులుగా ప్రతి పక్షాలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీ ఘటనను సాకుగా తీసుకుని నిరుద్యోగుల మద్దతు కూడగట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ దీక్ష చేస్తున్నబీజే రాష్ట్రంలో శాశ్వత రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోతారని అన్నారు. బీఆర్‌ఎస్‌ఎల్పీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఎన్ని దీక్షలు చేసినా బీజేపీ నేతలకు ఉద్యోగాలు రావు
‘’బండి సంజయ్ ధర్నాలు, దీక్షలు చేస్తే ఢిల్లీలో చేయాలి ఇక్కడ కాదు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందే మోదీ ప్రభుత్వం. కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మోడీ దేశానికి మోసం చేశారు. ముందు దేశంలో ఉద్యోగాలు భర్తీ చేయమని మోదీకి చెప్పి బీజేపీ నేతలు ఇక్కడ ధర్నాలు చేయాలి. అపుడు బీజేపీ నేతలకు ఉద్యోగాలు ఇచ్చేది లేనిది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. పేపర్ లీకేజీని బయటపెట్టింది మా ప్రభుత్వమే. నిరుద్యోగులకు నష్టం వాటిల్లకుండా చేసేది మేమే. బీజేపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగేవి స్కాంలు. తెలంగాణలో స్కీంలే అమలవుతాయి. వ్యాపం స్కాం జరిగిన మధ్యప్రదేశ్‌లో సాక్షులను చంపిన నీచులు బీజేపీ నేతలు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కలిపినా తెలంగాణ అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. బండి సంజయ్‌కి ఛాలెంజ్ చేస్తున్నా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపించగలరా? పేపర్ లీకేజ్ కొత్తగా ఈరోజే జరగలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలకు ఎంతమంది రాజీనామా చేశారు’’- మంత్రి జగదీశ్ రెడ్డి
బీజేపీతో మాకు పోటీయా?
‘’KTR గురించి మాట్లాడే స్థాయి బీజేపీ నేతలకుందా? ఇతర రాష్ట్ర ఐటీ మంత్రి పేరును బీజేపీ నేతలు చెప్పగలరా? ఐటీ మంత్రి అంటే KTR అని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించారు. ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్‌ది. ఆయన మీద ఈర్ష్య, ద్వేషంతోనే బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏ ప్రగతి సూచికలోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణతో పోటీ పడలేవు. బీజేపీ బూతుల్లో మేము పోటీ పడలేము. లక్షా 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. 20 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయి. వ్యవసాయ అనుబంధ విభాగాల్లో 50 లక్షల మందికి ఉపాధి కల్పించాం. స్కాంలు చేయడం, ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంలో మేము బీజేపీతో పోటీ పడలేము. దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి. సిట్ ముందు హాజరవమంటే బండి సంజయ్‌కి ఎందుకు లాగు తడుస్తోంది. దమ్ముంటే బీజేపీ పాలితరాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఏ మేలు ఎక్కువ జరుగుతుందో సంజయ్ లెక్కలు చెప్పాలి’’- మంత్రి జగదీశ్ రెడ్డి
ఎవరు ఎలాంటి వారో ప్రజలకు తెలుసు
‘’నిరుద్యోగులకు మాపై నమ్మకముంది. దొంగలు, బఫూన్ల మాటలు నమ్మొద్దు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. తెలంగాణ పోలీసుశాఖ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వేరే రాష్ట్రం పోలీసులు కేసుల ఛేదనలో తెలంగాణ పోలీసుల సాయం తీసుకుంటారు. సీబీఐ కేసుల విచారణ ఎంత చెత్తగా ఉంటుందో దేశ మంతటికీ తెలుసు. సీబీఐ విచారణ డిమాండ్ చేసి దోషులను కాపాడే ప్రయత్నం బీజేపీది. నోటిఫికేషన్లు ఇచ్చి యువతను బీజేపీకి దూరం చేశారని బండి సంజయ్ గతం లో ఆరోపించారు. ఇపుడు కూడా ఉద్యోగాల భర్తీ తొందరగా జరగొద్దని బండి సంజయ్ ఆశిస్తున్నారు. నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే సిట్ విచారణ తొందరగా పూర్తి చేయాలని డిమాండ్ చేయాలి. తొందరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. సీబీఐ విచారణ అంటే ఉద్యోగాల భర్తీని అడ్డుకోవడమే. నిరుద్యోగులు నిరుద్యోగులుగా ఉండాలనేది ప్రతిపక్షాల ఆలోచన’’- మంత్రి జగదీశ్ రెడ్డి
పోరాడలేని నిస్సహాయ, అచేతన స్థితిలో కాంగ్రెస్
‘’దేశ సంపదను ఇతర దేశాలకు తరలించినందుకు మోదీ రాజీనామా చేయాలి. అన్ని విలువలను తుంగలోకి తొక్కిన పార్టీ బీజేపీ. బీజేపీ చేస్తున్నది కార్పొరేట్ పాలన. నల్లచట్టాలు తెచ్చినందుకు మోదీ క్షమాపణ చెప్పడమే కాదు రాజీనామా చేయాలి. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే లంచం డబ్బులతో పట్టుబడితే చర్యలు తీసుకోని ప్రధానికి నైతిక విలువలు ఎక్కడివి. నైతిక విలువలు లేని బీజేపీకి రాజీనామాలు డిమాండ్ చేసే అర్హత ఎక్కడిది. నోటిఫికేషన్లు వేసేదాకా దీక్షల్లో కూర్చుంటామని ప్రతిపక్ష నేతలు ప్రకటిస్తే అభ్యంతరం లేదు. బీజేపీ దుర్మార్గపు ఆలోచన ఫలితమే రాహుల్ అనర్హత వేటు. తమపార్టీ తప్ప వేరేపార్టీలు దేశంలో ఉండకూడదు అనేదిద బీజేపీ ఆలోచన. రాహుల్ మీద అనర్హత వేటు పడ్డా గట్టిగా పోరాడలేని నిస్సహాయ, అచేతన స్థితిలో కాంగ్రెస్ ఉంది. దేశ ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. దేశం మావైపు చూస్తోంది. కేసీఆర్ కావాలని దేశం కోరుకుంటోంది. కాంగ్రెస్ నిస్సహాయ స్థితిలో ఉంది కనుకే బీఆర్ఎస్ రూపంలో మరో జాతీయ పార్టీ అవసరమైంది’’- మంత్రి జగదీశ్ రెడ్డి