Electric Bikes To Girl Students : తెలంగాణ (Telangana)లో కొలువు దీరిన కాంగ్రెస్ (Congress)పార్టీ హామీల అమలుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం... మిగిలిన వాటిని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme)కింద ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఆరోగ్య శ్రీ వైద్య ఖర్చుల పరిమితిని పెంచింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విద్యార్థినుల ఓట్లను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తోంది.  తాజాగా కాలేజ్ లకు వెళ్లే విద్యార్థినులకు ఎలక్రిక్ వాహనాలను పంపిణీపై వివరాలు ఆరా తీస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థినికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్రిక్ వాహనం ఇవ్వనుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో, అంతలోపే స్టూడెంట్లకు బైక్ ల పంపిణీ పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్‌ పరిధిలోనే 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లు 2 లక్షల మందికిపైగా ఉన్నారు. జిల్లాల లెక్క తేలాల్సి ఉంది. విద్యుత్ ద్విచక్ర వాహనాల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 


రేషన్ కార్డు ఉన్న వారికేనా ?
విద్యార్థిని కుటుంబం రేషన్‌  కార్డు పరిగణనలోకి తీసుకొని, రెగ్యులర్‌గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే పథకం వర్తించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన విద్యార్థినులు ఎంత మంది ఉన్నారు ? వారిలో ఎంత మంది రెగ్యులర్ కళాశాలలకు వెళ్తున్నారు ? బీపీఎల్ కార్డులున్న వారు ఏ యే ప్రాంతాల్లో ఉన్నారు ? కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏంటి ? అన్న వివరాలను తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, మెడికల్, ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీ, పీజీ కాలేజీలు 5వేలకు పైగా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులు 70వేల మంది ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. 18 సంవత్సరాలకు పైబడిన వారిలో డిగ్రీ, పీజీ, ఇతర మేనేజ్‌మెంట్‌ కోర్సులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఇందులో సైతం ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులు అధికంగా ఉన్నారు.


రూ. 350 కోట్ల ఖర్చు అయ్యే అవకాశం
ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటర్ 50 నుంచి లక్షన్నర దాకా ఉన్నాయి. ఆయా కంపెనీలు, వాటి సామర్థ్యాన్ని బట్టి రేట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారు చేసే కంపెనీలకు రాయితీ అందిస్తోంది. ఫేమ్-2 పథకం కింద ఒక్కో వాహనం ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా 40 శాతానికి సమానంగా సబ్సిడీ ఇస్తోంది. కేంద్రం ఇచ్చే రాయితీలకు  అనుగుణంగా, విద్యార్థినులకు పంపిణీ చేసేలా అధికారులు విధివిధానాలు తయారు చేస్తున్నారు. ఒక్క వాహనానికి సగటున రూ. 50 వేలతో లెక్కించినా, సుమారు రూ. 350 కోట్లు బడ్జెట్ లో వెచ్చించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్‌ స్కూటీలకు  డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా మంది వాహనం డ్రైవింగ్ చేయడం నేర్చుకున్నా, లైసెన్స్ లు లేవు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే వాహనాలతో తిరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న వారికి, లేకపోయిన వారు తీసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.