Congress Leaders Medigadda Tour: ఇటీవల వార్తల్లో నిలిచిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్లనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి వెళ్లబోతున్నారు. ఫిబ్రవరి 13న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే 10.15 వరకు అసెంబ్లీలో పాల్గొన్న అనంతరం.. అందరూ కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లనున్నారు.


ఇందుకోసం అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులను మేడిగడ్డకు ఏర్పాటు చేశారు. మూడు గంటలకల్లా మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకొని అందరూ కలిసి 2 గంటల పాటు సైట్ విజిట్ చేయనున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. మళ్లీ సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కు కాంగ్రెస్ నేతల బృందం బయలుదేరనుంది. వీరంతా తొలుత బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతానికి చేరుకొనేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ వ్యూపాయింట్ ప్రాంగణం దగ్గర దాదాపు 3 వేల మంది కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలపై పీపీటీ, సభ నిర్వహిస్తారని తెలుస్తోంది. భద్రతపరంగా ప్రజా ప్రతినిధుల బస్సులు ప్రయాణించే మార్గాల్లో పోలీసులు ప్రయాణించి పరిశీలించారు. రోడ్లు, కల్వర్టుల దగ్గర బాంబు స్క్వాడ్ టీమ్ లు తనిఖీలు చేశాయి.


కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు బ్యారేజీ మధ్యలోని పిల్లర్లకు బీటలు వచ్చి బ్యారేజీ కాస్త కుంగింది. ఆ తర్వాత గేట్ల వద్ద బీటలు కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు బాగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకున్న సంగతి తెలిసిందే.


అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులోని నిర్మాణాలపై విచారణకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. అందులో భాగంగా సీఎంతో పాటు రాష్ట్ర ప్రజాప్రతినిధులు అందరూ మేడిగడ్డ బ్యారేజీని, ఇతర ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ప్రాజెక్టులోని నిర్మాణ లోపాలు చూపడం కోసం మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ప్రభుత్వ ఖర్చుతో తీసుకెళ్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ప్రకటించారు. ఇందుకోసం 40 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.