హైదరాబాద్: నగరంలోని పాత బస్తీ చార్మినార్ గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం(Charminar Fire Accident)పై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం ఘటనలో మొదట 8 మంది మృతిచెందారు. చికిత్స పొందుతూ మరో 8 మంది చనిపోగా, మృతుల సంఖ్య 16కి చేరుకుంది. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను పోలీస్​, ఫైర్​ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్​లోని పాత బస్తీలో గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన  అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక కుటుంబాలతో ఫోన్ లో పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడుతామని, మెరుగైన వైద్య చికిత్స చేయిస్తామని భరోసా ఇచ్చారు. అగ్నిప్రమాదం సంభవించి ఏకంగా 16 మంది చనిపోవడం బాధాకరం అన్నారు.

బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డిని ఆదేశించారు. ఇరుకైన గల్లీ కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తుతుందని సమాచారం.

8  మంది మృతులను ఆరుషి జైన్‌ (17), అభిషేక్‌ మోడీ (30), షీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలి గుప్తా (7), రాజేందర్‌ కుమార్‌ (67), సుమిత్ర (65), మున్నిబాయి (72)లుగా పోలీసులు గుర్తించారు.

 

మంటల్లో చిక్కుకున్న పలువురిని పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొచ్చి.. వారిని చికిత్స నిమిత్తం మలక్ పేట యశోద, అపోలో, డీఆర్‌డీవో, ఉస్మానియా హాస్పిటల్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. మంటల్లో కాలిపోయి కొందరు, పొగ పీల్చడంతో కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పరీక్షించిన వైద్యులు పలువురు చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లోపల 30 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఓవైపు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతూ, మరోవైపు కాలిన గాయాలైన వారిని రెస్క్యూ చేసి అంబులెన్సులలో ఆసుపత్రులకు తరలించారు.

అగ్నిమాపక సిబ్బందికి మెరుగైన శిక్షణ అవసరం: కిషన్ రెడ్డికేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుల్జార్‌హౌస్‌ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉదయం 6 గంటలకు ప్రమాదం చోటుచేసుకోగా, సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. చిన్న ప్రమాదమే అయినప్పటికీ, ప్రాణ నష్టం అధికంగా ఉందని.. సరైన సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేపడితే మెరుగైన ఫలితాలు వచ్చేవయన్నారు. అగ్నిమాపక సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం సరైన పరికరాలు, మెరుగైన శిక్షణ అందించాల్సి ఉందన్నారు. అగ్నిమాపక శాఖ టెక్నాలజీ మెరుగుపరుచుకోవాలని, సాధ్యమైనంత త్వరగా సహాయక చర్యలు చేపడితే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.