Revanth Reddy:  పీసీసీ అధ్యక్షుడిగా తాను 38నెలల పాటు పోరాడానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.  పార్టీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో మహేశ్‌కుమార్‌కు కీలక బాధ్యతలు ఇచ్చిందని తెలిపారు.  


ఇది సెమీ ఫైనల్స్ మాత్రమే
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేశారని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటి వరకు మనం సెమీ ఫైనల్స్ వరకే వచ్చామని.. 2029లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే మన ఫైనల్స్ అని రేవంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ కార్యకర్తలు పని చేసి మమ్మల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా గెలిపించారు. ఇప్పుడు టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కార్యకర్తలను జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా గెలిపించాల్సిన బాధ్యత మా పై ఉందని తెలిపారు. ఇక నుంచి మహేశ్ కుమార్ కార్యకర్తలను సమన్వయం చేసి.. పార్టీని ముందంజలో నడిపిస్తారని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ క్యాడర్ ఇదే ఉత్సాహంతో పని చేయాలని సూచించారు.


 
టీపీసీసీ అప్పగింత
టీపీసీసీ పదవిని మహేశ్ కుమార్ గౌడ్ కు అప్పగించారు రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ .. ‘‘పీసీసీ చీఫ్ గా హైకమాండ్ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాను. ఇంద్రవల్లి దళిత గిరిజన దండోరాతో సమరశంఖం పూరించాము. అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.10లక్షలకు పెంచాము. వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతాంగానికి భరోసా ఇచ్చాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్‌ డిక్లరేషన్‌లో రాహుల్‌ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే.. తప్పక జరిగితీరుతుందని నిరూపించాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రూ.రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించాం. ఆర్టీసీలో ఇప్పటివరకు 85 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేశారు. మోదీ ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచి మహిళలకు భారంగా మార్చింది. మేం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నాం. వ్యవసాయ రుణం రూ.2లక్షలకు పైగా ఉన్న రైతులు భయపడొద్దు. రూ.2లక్షలకుపైగా ఉన్న మొత్తాన్ని రైతులు బ్యాంకుల్లో చెల్లిస్తే రూ.2లక్షల రుణమాఫీ పూర్తవుతుంది.  200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నాం. ఎన్నో పోరాటాల తర్వాత స్వరాష్ట్రం సాధించాం. పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుంచి పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లాం. తుక్కుగూడ సభ వేదికగా ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటి అమలు కోసమే పని చేస్తున్నామని’ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


 


రుణమాఫీ చేసి చూపించాం
ఆగస్ట్ 15లోగా రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తా అన్న సన్నాసి ఎక్కడని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం..  రుణమాఫీ చేసి, వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపించామన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలు పోతేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పామన్నారు. ఇప్పటికే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. ప్రభుత్వ విద్యాసంస్థలకు  ఉచిత విద్యుత్‌ ఇచ్చి విద్యార్థులకు ఎంతో మేలు చేశామన్నారు.   ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్‌ గమనమే మారిపోయింది. కొత్తగా నిర్మించే రీజినల్‌ రింగ్‌రోడ్డుతో తెలంగాణ స్వరూపమే మారుతుందన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, విజయాలు సెమీఫైనల్స్‌ మాత్రమే.. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసినప్పుడే మనం ఫైనల్స్‌లో గెలిచినట్లు. 2029 ఫైనల్స్‌లో మనం ఘన విజయం సాధించాలన్నారు. 1994 నుంచి రాష్ట్రంలో ప్రతిపార్టీ రెండు సార్లు గెలిచింది. కాంగ్రెస్‌ కూడా కచ్చితంగా వరుసగా రెండు సార్లు అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉపేక్షించేది లేదని రేవంత్ హెచ్చరించారు.