Revanth Reddy On Health Sector: తెలంగాణలో అవసరం ఉన్న అందరికీ ఆరోగ్య శ్రీసేవలు అందేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్లకే ఆరోగ్యశ్రీ సేవలు అందించొద్దని అందరికీ సేవలు అందుబాటులో ఉంటారన్నారు. ఆరోగ్య శాఖపై సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
తెలంగాణలో రేషన్ కార్డు లేకపోయినా సరే ఆరోగ్యశ్రీ సేవలు అందాలని  ఆ దిశగా విధి విధానాలు రూపొందించాలని సూచించారు రేవంత్ రెడ్డి. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దన్నారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని... ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా సూచించారు. దీనిపై అధ్యయనం చేసి కొత్త జీవో విడుదల చేయాలన్నారు. 


ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎం. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషకం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఆదేశించారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు. 


అన్నింటికీ ఇదే సూత్రం వర్తింపజేయాలి: హరీష్


ఆరోగ్య శ్రీకి రేషన్ కార్డుతో పని లేకుండా చేసిన సీఎం మిగతా వాటికి కూడా ఇదే సూత్రం వర్తింప జేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డు ఇతర పత్రాలు లేకుండానే ఇవ్వాలని సూచించారు.  రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని అన్నారు.