Rangareddy Road Accident | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దాదాపు 70 మంది ప్రయాణికులతో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లోడ్ ఢీకొట్టింది. అనంతరం బస్సు మీద టిప్పర్ లోడ్ ఒరిగి పడటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు
టిప్పర్, బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకోవాలని సీఎం వారికి సూచించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 19 మంది మృతిచెందిన ఘటనపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు . మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
చేవెళ్ల ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతిరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొన్న ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ళేలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి తగిన వైద్య చికిత్సలు చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
స్థానికులు, వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అదేవిధంగా గాయపడినవారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే నడిరోడ్డుపై లారీ, బస్సు అడ్డంగా పడిపోవడంతో చేవెళ్ల వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సీఐ
రోడ్డు ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జీసీబీ ఎక్కింది. దాంతో తీవ్రంగా గాయపడిన సీఐ ని సైతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టిప్పర్ లారీ అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు, అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.