తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎవరూ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్ కే ఉందని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం కూడా కేసీఆర్ వల్లే అవుతుందని మాట్లాడారు. అసలు సీఎం కేసీఆర్ తరహాలో పరిపాలన చేయడం ఎవరి వల్లా కాదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలోని ఆ శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. 


ఏపీలో మొత్తం కుల రాజకీయాలే నడుస్తున్నాయని మల్లారెడ్డి విమర్శించారు. కమ్మ, కాపు, రెడ్డి అంటూ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ పవర్ ఏంటనేది అందరికీ తెలుసని మల్లారెడ్డి అన్నారు. పక్క రాష్ట్రాల వాళ్లు కేసీఆర్ లాంటి సీఎం కావాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోనూ వచ్చేది కేసీఆర్ సర్కారేనని మల్లారెడ్డి మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌లను తిడుతున్నారని వారు తమ ఉసురు కొట్టుకుని పోతారని అన్నారు. మంత్రి కేటీఆర్‌ వల్లే హైదరాబాద్ కళకళలాడుతోందని అన్నారు.