ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి ముఖ్యమంత్రి సహా విపక్షాలకు చెందిన రాజకీయ నేతలు హాజరు అయ్యే సాంప్రదాయం ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. నేడు కూడా ఆగస్టు 15 సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతలు కూడా హాజరు కాలేదు.


దీంతో వరుసగా మూడోసారి రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ దూరంగా ఉన్నట్లు అయింది. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా ఎట్‌హోంలో కనపడలేదు. తెలంగాణ బీజేపీ అగ్ర నేతలు కూడా దూరంగా ఉన్నారు. 


తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్ ఆరాధేతో పాటు, ఉన్నతాధికారులు, కొంత మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేనీటి విందు కార్యక్రమానికి సీఎస్, డీజీపీతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. కేబినెట్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వలేదు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకుల హడావిడి కనిపించలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ బీజేపీ కీలక నేతలు కూడా హాజరుకాలేదు.