తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి (BRS) ను ఢీకొట్టే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ (BJP) ఒక్కటేనని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇస్తున్న లీకులతో సతమతం అవుతున్న బీజేపీ.. ఇకలాభం లేదనుకుని పార్టీ నేతలు నేడు భేటీ అయ్యారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో పార్టీ నేతలు కీలక భేటి జరిగింది. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి సహా పార్టీలో ముఖ్య నేతలు జితేందర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు.
తన ఇంట్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ ముగిసిన అనంతరం జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ఈ స్థాయికి చేరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యం అన్నారు. తమ పార్టీలో రాత్రికి రాత్రే ఎవరికి పదవులు రావన్నారు. పదవులకు ముందు లీకుల కల్చర్ బీజేపీలో లేదన్నారు. అయితే బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను మారుస్తారని సీఎం కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నట్లుగా.. బీజేపీలో ప్రచార కమిటీ పదవి లేదని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ కు బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారని మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ ను మారుస్తారన్న లీకుల వెనుక ఉన్నది సీఎం కేసీఆర్ అని అనుమానం వ్యక్తం చేశారు.
బీజేపీ బలోపేతంపై పార్టీ కీలక నేతలు చర్చించామన్నారు. తమ పార్టీలో ఎలాంటి అసంతృప్తి, విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశారు జితేందర్ రెడ్డి. మాజీ మంత్రి జూపల్లి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏ పార్టీలో చేరుతారో వారి ఇష్టమన్నారు. అయితే తమ పార్టీలో చేరితో వారికి కూడా మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తుందని, కానీ కేసీఆర్ వేరే పార్టీలతో కలిసి పొత్తు ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగుతారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ను గద్దె దించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.