Apsara Murder Case: హత్యకు గురైన అప్సరపై సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిగత విషయాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారని మృతురాలి తల్లి అరుణ ప్రశ్నించారు. తాము కూతురు చనిపోయిన బాధలో ఉన్నామని, తమ కూతురుని చంపిన వాడిని ఆ భగవంతుడే శిక్షిస్తాడని అప్సర తల్లి అరుణ వ్యాఖ్యానించారు. గుడికి పోయిన అమ్మాయిని సాయి కృష్ణ ట్రాప్ చేసి ప్రేమలోకి దించి చివరికి మోసం చేసి హతమార్చాడని పేర్కొన్నారు. అప్సరకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ప్రసారం చేయడంపై ఆమె ప్రశ్నించారు. తమను, తమ కుటుంబాన్ని మనశ్శాంతిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు.
మీడియాపై అసహనం వ్యక్తం చేసిన అప్సర తల్లి
అప్సరకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, గతంలో జరిగిన పెళ్లి గురించిన ప్రసారం చేస్తున్న మీడియాపై అప్సర తల్లి అరుణ అసహనం వ్యక్తం చేశారు. కూతురు పోయిన బాధలో ఉన్నామని తమకు మనశ్శాంతి ఇవ్వాలని అన్నారు. మీకేం న్యాయం కావాలని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తమకే న్యాయం వద్దని, తమ కూతురిని చంపినోడిని ఆ భగవంతుడే శిక్షిస్తాడని అన్నారు. తమ మనశ్శాంతి కోసం ప్రశ్నలతో వేధించకుండా వదిలేయాలని కోరారు. అడిగిన ప్రశ్నలు మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తానేం అబద్ధం చెప్పడం లేదని, బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తనకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదని చెప్పారు. గతంలో అప్సరకు జరిగిన పెళ్లికి సంబంధించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సాయి కృష్ణకు అప్సరకు మధ్య జరిగిన వ్యవహారం, హత్య నిజమైనప్పుడు.. దీని గురించి కాకుండా గతంలో జరిగిన వ్యక్తిగత విషయాల గురించి అడగడం ఎందుకని ప్రశ్నించారు. చనిపోయిన అమ్మాయిని బ్లేమ్ చేసి ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారని అన్నారు. చివరగా మీడియా ప్రతినిధులకు చేతులు జోడించి నమస్కరించారు.
ఇద్దరి మధ్య వివాహేతర బంధం!
సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ, అప్సర ఒకే వీధిలో ఉంటారు. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమై ఓ పాప కూడా ఉంది. అయితే.. అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటికే ఒకసారి ఆమె గర్భం దాల్చడంతో సాయికృష్ణ అబార్షన్ చేయించాడు.. తాజాగా అప్సర మరోసారి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని గత రెండు నెలలుగా సాయి పై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నది. దీంతో ఆమెనుంచి తప్పించుకునేందుకు హత్య చేయాలని నిర్ణయించుకుని పక్క ప్లాన్ సిద్ధం చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.
హత్య చేసిన తర్వాత రోజంతా కారులోనే మృతదేహం
అప్సరను హత్య చేసిన తర్వాత అదే కారులో తీసుకొని ఇంటికి వచ్చిన సాయి.. డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒక రోజు మొత్తం ఇంటి ముందే పార్క్ చేశాడు. మరుసటి రోజున డెడ్ బాడీ తీసుకువెళ్లి మ్యాన్ హోల్ లోంచి కిందికి పడేశాడు. మ్యాన్‌హోల్‌లో డెడ్ బాడీ వేసిన తర్వాత అందులో మట్టిని నింపాడు. మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుందని మట్టి నింపుతున్నట్లు అందర్నీ నమ్మించాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉదయం సమయంలో మ్యాన్‌హోల్‌లో మట్టిని నింపించాడు. అప్సర కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. అప్సర కోసం పోలీసులతో పాటు నిందితుడు సాయి కూడా అన్నిచోట్ల వెతికాడు. పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్ ట్రాక్ రికార్డును పరిశీలించారు. సాయి, అప్సర సెల్ ఫోన్లు మరుసటి రోజు ఒకే దగ్గర ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గురువారం రోజున సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది.