Rajiv Gandhi Statue: తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌ బాబు, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి క్రిష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిగతా మంత్రివర్గ సహచరులతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.


ప్రస్తుతం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆగస్ట్ 20న రాజీవ్​ గాంధీ జయంతి రోజున ఆవిష్కరించాలని రాష్ట్ర కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. ఆ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించి వారితో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని రేవంత్ సర్కారు భావించింది. కానీ, అది సాధ్యం కాలేదు. 


మరోవైపు, సచివాలయం లోపల ప్రధానమైన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఇటీవలే భూమి పూజ కూడా చేసారు. డిసెంబర్​ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు దేశానికి ప్రధానులుగా పని చేసిన ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు విగ్రహాలు వరుసగా ఉన్నాయని.. కాబట్టి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అమరవీరుల స్తూపం, సచివాలయం మధ్యలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.