ఎన్నో ఆశలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ హామీలు అమలు కావడం లేదని, కేసీఆర్ ప్రభుత్వం భూములు పంచలేదని.. కాంగ్రెస్ ఇచ్చిన భూములను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. తన పాద‌యాత్ర ఎన్నిక‌ల కోసం కాదని.. రాజ‌కీయాల కోసం అంత‌క‌న్నా కాదు. ద‌గా ప‌డ్తున్న తెలంగాణ ప్ర‌జ‌ల కోసం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో చేస్తున్న పాద‌యాత్ర అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని తొండ‌ప‌ల్లె కార్న‌ర్ మీటింగ్ లో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఈ తొమ్మిద‌న్న‌ర ఏళ్ల‌లో కొత్త‌గా ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోగా.. పాత ఉద్యోగుల‌ను తీసేసే కుట్ర చేస్తోంది. రిటైర్ అయిన ఉద్యోగుల‌ను కొన‌సాగిస్తూ.. కొత్త‌వారికి ఉద్యోగాలు రాకుండా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోందన్నారు.


మ‌నం తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నామో.. గ‌ద్ద‌రన్న ఆట ఆడి, పాట పాడి చెప్పాడు మ‌న భూములు మ‌న‌కే.. మ‌న నీళ్లు మ‌న‌కే.. మ‌న కొలువులు మ‌న‌కే.. అని మ‌నం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ద‌శాబ్ద‌కాలంగా కొలువులు లేవు.. నీళ్లు లేవు. పాల‌మూరు - రంగారెడ్డి నుంచి ఇన్నేళ్ల‌లో ఒక్క చుక్క నీరు కూడా ఈ ప్ర‌భుత్వం ఇవ్వ‌లేదు. రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వాల‌ని నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం, వైఎస్సార్ ప్రాణ‌హిత‌- చేవెళ్ల ప్రాజెక్టును చేప‌ట్టింది. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. రీడిజైన్ పేరుతో ప్రాణ‌హిత ప్రాణం తీసేశారు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మొద‌లే పెట్ట‌లేదు అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.


రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చుంటే ప్రాణ‌హిత‌-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి పొలాల‌ను నీళ్ల‌ను అందిచ్చేది. ఎన్నో వ్య‌వ‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి ప్రాజెక్టులు క‌ట్ట‌డం కాంగ్రెస్ కు మాత్ర‌మే సాధ్యం. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్, జూరాల‌, నెట్టెంపాడు, కోయిల్ సాగ‌ర్, వంటి ప్రాజెక్టుల‌ను క‌ట్టి నీళ్ల‌ను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. పాల‌మూరు-రంగారెడ్డి పూర్తికాక‌పోవ‌డానికి కేసీఆరే కార‌ణం. ల‌క్ష్మిదేవి ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ పూర్తి కాక‌పోతే ఓట్లు అడ‌గ‌మ‌న్న టీఆర్ఎస్ నాయ‌కులు ఆ మాట‌మీదే ఉండాలన్నారు.


‘వికారాబాద్ జిల్లా ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గం తొండ‌ప‌ల్లి నుంచి నేనే అడుగుతున్నా.. ల‌క్ష్మిదేవి ప‌ల్లి రి.ర్వాయ‌ర్ క‌ట్ట‌లేదు కాబ‌ట్టి.. ఉమ్మ‌డి రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల్లో మీరు ఓట్లు అడ‌గ‌వ‌ద్దు. తెలంగాణ తెచ్చుకుందే కొలువుల కోసం.. తొమ్మిద‌న్న‌ర సంవ‌త్స‌రాల నుంచి రాష్ట్రంలో బిడ్డ‌ల‌కు కొల‌ువులు రాలేదు. ఆంధ్రా పాల‌కులు మ‌నకు ద్రోహం చేస్తున్నార‌ని త‌రిమి పంపినాం.. ఇప్పుడు ద్రోహం చేస్తున్న సొంత పాల‌కుల‌ను పాత‌ర పెట్టే స‌మ‌య‌ం ఆస‌న్న‌మైంది. ఇందిర‌మ్మ రాజ్యం వస్తేనే రైతులు సంతోషంగా ఉంటారు.. కొలువులు వ‌స్తాయి. పొలాల‌కు నీళ్లు పారతాయని’ భట్టి విక్రమార్క అన్నారు.


కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక‌క మిగులు బ‌డ్జెట్ అయిపోయింది. అదీ స‌రిపోక మ‌న‌ల్ని తాక‌ట్టు పెట్టి తెచ్చిన రూ. 5ల‌క్ష‌ల కోట్లు అయిపోయాయి. కానీ రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు. ఇండ్లు, భూములు పంచింది లేదు. ప‌రిశ్ర‌మ‌లు పెట్టింది లేదు. గుడిని, గుళ్లో లింగాన్ని మింగే నైజం కేసీఆర్ ది. కేసీఆర్ అవినీతి పాల‌న వ‌ల్ల తెలంగాణ తెచ్చుకున్న ఏమీ సాధించుకోలేక పోయాం. త్వ‌ర‌లో ఏర్ప‌డే ఇందిర‌మ్మ రాజ్యంతో పేద‌ల‌కు రెండుగ‌దుల ఇందిర‌మ్మ ఇండ్ల కోసం రూ. 5 ల‌క్ష‌లు, రైత‌న్న‌ల‌కు ఏక‌కాలంలో రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ, కూలీబంధు పేరుతో కూలీల‌కు ఏడాది అకౌంట్లో రూ.12 వేలు వేస్తాం. ప్ర‌తి విద్యార్ధికి కేజీ నుంచి పీజీ వ‌ర‌కూ ఉచిత నిర్భంధ ఇంగ్లీషు మీడియం విద్య‌ను అందించ‌డం జ‌రుగుతుంది. గ్యాస్ సిలండ‌ర్ ను రూ. 500 ఇస్తాము. గ‌తంలో ఇచ్చిన‌ట్లుగా పాలిహౌజ్ లు, డ్రిప్, స్ప్రింక్ల‌ర్లు, ఎరువులు, వ్య‌వ‌సాయ ప‌నిముట్ల‌ను స‌బ్సిడీకే ఇస్తామన్నారు భట్టి విక్రమార్క.


కేసీఆర్ రైతుబంధు పేరుతో రూ. 5 వేలు ఇచ్చి గ‌తంలో కాంగ్రెస్ ఇచ్చిన స‌బ్సిడీల‌ను ఎత్తేసి.. రైతుల ద‌గ్గ‌ర అద‌నంగా రూ. 15 వేలు గుంజుకుంటోంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంప‌ద‌ను దోపిడీ చేస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌జ‌ల సంప‌ద ప్ర‌జ‌ల‌కే పంచుతాం. జాబ్ కేలండ‌ర్ ప్ర‌క‌టించి.. కొలువులు భ‌ర్తీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే త‌ప్ప‌కుండా చేస్తుంది. ఈ కార్న‌ర్ మీటింగ్ లో ప‌రిగి మాజీ ఎమ్మెల్యే, వికారాబాద్ డీసీసీ అధ్య‌క్షుడు టీ. రామ్మోహ‌న్ రెడ్డి, గ‌ద్ద‌ర‌న్న స‌ర్పంచ్ గీత‌, మోగుల‌య్య‌, మండ‌ల కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు ప‌రుశురామ్ రెడ్డి, ఎంపీటీసీ వెంక‌టేష్‌, ర‌జిత‌, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు రాములు, లాల్ కిష్ణ‌, హ‌నుమంత, ఆంజ‌నేములు, నారాయ‌ణ ఇత‌ర సాయ‌కులు పాల్గొన్నారు.