ముఖ్యమంత్రి జగన్‌తో సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అవుతున్నారు. సినిమా టికెట్‌ల వ్యవహారం తేలిపోనుందని అంతా అనుకున్న టైంలో మంత్రి పేర్ని నాని ఝలక్ ఇచ్చారు. ఈ సమావేశం అసలు ఉద్దేశం టికెట్‌ ధరలపై కాదని తేల్చేశారు. 


గురువారం 11 గంటలకు సీఎం జగన్‌తో సినీ పరిశ్రమ ప్రతినిధులు భేటీ కానున్నారు. ఈ భేటీలో చిరంజీవి, మహేష్‌, ప్రభాస్‌, జూనియర్ ఎన్టీఆర్‌ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మరికొందరు సనీ పరిశ్రమ ప్రముఖులు ఈ భేటీలో ఉండబోతున్నారని తెలుస్తోంది. 


ఉదయం 9 గంటలకు బేగంపేటలో చార్టెడ్‌ ఫ్లైట్‌లో టాలీవుడ్‌ ప్రముఖులు విజయవాడ బయల్దేరి వెళ్తారు. గన్నవరంలో దిగి అక్కడి నుంచి తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకుంటారు. 






ఈ భేటీపై మాట్లాడిన మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం సినీ ప్రతినిధులు వస్తున్నారని అన్నారు. కొవిడ్ కారణంగా తక్కువ మందినే రమ్మని చెప్పామని వాళ్లు మాత్రం ఎక్కువ మంది రావాలనుకుంటున్నారని  చెప్పారు. 


జగన్, సినీ ప్రతినిధుల భేటీకి ప్రత్యేక అజెండా ఏమీ లేదన్నారు. వాళ్లు వచ్చాక చెప్పింది విని మాట్లాడతామన్నారు పేర్ని నాని. టికెట్‌ ధరలపై వేసిన కమిటీ ఇంకా రిపోర్టు ఇవ్వలేదని గుర్తు చేశారు మంత్రి. ఆ రిపోర్ట్ వచ్చాక అన్ని వివరాలు చెప్తామన్నారు. ఇంకా టికెట్ల రేట్లు ఫైనల్‌ కాలేదని రిపోర్టు వచ్చాక దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. 


ప్రభుత్వంపై తమ్మారెడ్డి చేసిన కామెంట్స్‌పై  స్పందించాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పేర్నినాని. ఏమైన అభిప్రాయాలు ఉంటే తనను సంప్రదిస్తే మాట్లాడతానంటూ వ్యాఖ్యానించారు. 






వచ్చే నెల నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ కానున్న పరిస్థితుల్లో టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అంతా భావించారు. కానీ అజెండాలోనే ఆ అంశం లేదని మంత్రి  బాంబు పేల్చారు. అసలు సినీ ప్రతినిధులు వెళ్లి సీఎంతో ఏ మాట్లాడుతారో అన్న చర్చ చాలా మందిలో మొదలైంది.