తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ చేశారు. రెండు రాష్ట్రాల్లో యాత్ర చేయాలని నిర్ణయించారు. జనసేన సోషల్ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్య్యూలో చాలా విషయాలు వెల్లడించారు. 


తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తూ త్వరలో భారీ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. అనుష్టు నారసింహ యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న  నరసింహ ఆలయాల మీదుగా జనసేన అధినేత యాత్ర సాగనుంది. 






కొండగట్టు నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారు. ఎప్పుడు ప్రారంభిస్తారని మాత్రం స్పష్టం చేయలేదు. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. 30 ఆలయాలను సందర్శిస్తూ సాగే ఈ యాత్ర ఎలా ఉంటుందన్నది కూడా తెలియాల్సి ఉంది. పవన్ కల్యాణ్ యాత్ర పాదయాత్ర చేస్తారా లేక బస్సు యాత్ర చేస్తారా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ఏం చేసినా దశలవారీగా ఉంటుందని పవన్ స్పష్టత ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల లీడర్లతో మాట్లాడతానంటూ చెప్పారు కూడా. 


ఈ యాత్ర ఆధ్యాత్మికంగా సాగుతుందా లేకుంటే రాజకీయాలు ఇందులో కలుస్తాయా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ యాత్ర ఎజెండా, కార్యచరణ, షెడ్యూల్ వంటి విషయాల పై త్వరలోనే పవన్ క్లారిటీ ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
 
చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ తనపై వైసీపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ ఘాటుగా బదులిచ్చారు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలకు సమాధానం ఇస్తూ ప్రజలకే తాను దత్తపుత్రుడినని.. ఎప్పుడైనా తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మాట్లాడతానన్నారు. 


ప్రభుత్వం సృష్టించిన ఉద్యోగల సమస్యలపై తాము మాట్లాడితే తప్పేంటని పవన్ ప్రశ్నించారు. ఈ సమస్య విపక్షాలు తీసుకురాలేదని.. ఇచ్చిన హామీ నెరవేర్చలేక ప్రభుత్వం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు. వచ్చిన సమస్యను పరిష్కరించాల్సిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఉద్యోగులను రెచ్చగొట్టి ఇంత వరకు తీసుకొచ్చారని విమర్శించారు. 






తప్పును ఎత్తి చూపిన ప్రతి ఒక్కరూ శత్రువుగానే ప్రభుత్వానికి శత్రువుగా కనిపిస్తున్నారని.. డూడూ బసవన్నలే ప్రభుత్వానికి కావాలని పవన్ ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయాలని చెప్పడమే తప్ప ప్రభుత్వం విఫలం కావాలని తాను ఎప్పుడూ కోరుకోనుంటూ సజ్జలకు చురకలు వేశారు. తనపై విమర్శలు, తన కామెంట్స్‌పై సెటైర్లు ఆపి.. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చూసుకోండని సజ్జలకు సూచన చేశారు పవన్ కల్యాణ.